హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని తాకింది. దీంతో గురువారం జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, జనగామ, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్‌లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి. మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరిక జారీచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని సూచించారు.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరులో పొలం పనులకు వెళ్లిన మహిళలపై పిడుగు పడి ముగ్గురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరి పొలంలో కలుపు తీస్తుండగా ఒకసారిగా పిడుగు పడి కుమ్మరి లక్ష్మి మృత్యువాతపడింది. ఎడ్ల యాదమ్మ కూలీ పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో పిడుగుపడటంతో ఆమె మరణించారు.
సీజన్లో మొదటిసారి పలు జిల్లాల్లో 10 సెం.మీపైగా వర్షపాతం నమోదైనట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 12.36 సెం.మీ, పెద్దవంగరలో 11.86 సెం.మీ, మరిపెడలో 11.41 సెం.మీ, నెల్లికోడూరులో 10.83 సెం.మీ, చిన్నగూడురులో 10.34 సెం.మీ, మధిరలో 11.72 సెం.మీ, ముదిగొండలో 11.61 సెం.మీ వర్షపాతం నమోదైంది.