Heavy Rains | నాగర్‌కర్నూల్ : మొంథా తుపాను ప్రభావంతో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చారకొండ మండల పరిధిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎర్రవల్లి – గోకారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బైరాపూర్ వద్ద రోడ్డుపై నుంచి వాగు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కల్వకుర్తి – నాగర్‌కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.
ఇక నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అమ్రాబాద్‌లో 19.7, ఐనవోలులో 17.8, అచ్చంపేటలో 15.8, చారకొండలో 13.3, ఊర్కొండలో 12.4, తెల్కపల్లిలో 12.1, బల్మూరులో 12, వెల్దండలో 10.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.