Pre Release Event | టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదల సమీపిస్తున్నప్పుడు అభిమానుల్లో హైప్, ఆసక్తి పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏ సినిమాకి అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అతిపెద్ద ప్రమోషనల్ వేదికగా మలచుకుంటారు. ఇవి సినిమా విజయానికి పునాది వేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతాయి. అందుకే ఈ ఈవెంట్స్ కోసం మేకర్స్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం, అగ్రశ్రేణి అతిథులను ఆహ్వానించడం, పాటలు, ట్రైలర్లు విడుదల చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇటీవల నిర్మాతలు ఈ ఈవెంట్స్‌లో కొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నారు. తమ బ్యానర్లో రూపొందుతున్న రాబోయే సినిమాల హీరోలను ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో కామన్‌గా మారింది. ఉదాహరణకు, మెగాస్టార్ చిరంజీవి ఇటీవల విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ సినిమాను నిర్మించిన సాహు గారపాటి బ్యానర్లోనే చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాను చేస్తున్నారు.మరో ఉదాహరణగా, జూనియర్ ఎన్టీఆర్ గాయంతో బాధపడుతున్నప్పటికీ, కాంతార చాప్టర్ 1 ఈవెంట్‌కు హాజరై ఉత్సాహం నింపారు. ఆ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్తోనే తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ మూవీ చేస్తున్నారు.
ఇప్పుడు అదే బాటలో యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కూడా నడుస్తున్నారు. ఆయన నిర్మాణంలో రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో వస్తున్న మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చీఫ్ గెస్ట్‌గా హాజరు అయ్యారు. సూర్య రాకతో సందడి వాతావరణం నెలకొంది. అయితే నాగవంశీ–సూర్య కాంబినేషన్లో ఓ కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలోనే సూర్యను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.మొత్తానికి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. నిర్మాతలు ప్రమోషన్‌తో పాటు తమ తదుపరి ప్రాజెక్టులకు బలమైన కనెక్షన్ క్రియేట్ చేసే విధంగా ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ట్రెండ్‌ను ఫ్యూచర్లో మరెంతమంది ఫాలో అవుతారో చూడాలి.