మహబూబ్నగర్ : జడ్చర్ల పట్టణంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని నల్లకుంట ప్రాంతంలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కట్ట తెగిపోయి.. పట్టణ ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరగా.. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాల్మీకినగర్లో నీటి ఉధృతికి నాలాలో పట్టణానికి చెందిన రాఘవేందర్ అనే వ్యక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.
వెంటనే గమనించిన స్థానికులు రాఘవేందర్ను నాలా నుంచి వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాఘవేందర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో నీరు ఇళ్లలోకి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. అయితే, పట్టణంలో వరద నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.