హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తరగతి గదిలో పాఠాలు శ్రద్ధగా వింటున్న బాలిక గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఏపీలోని కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా పలసపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది.
ఈ క్రమంలో ఆదివారం పాఠశాలకు వెళ్లిన సిరి.. పాఠాలు శ్రద్ధగా వింటుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో వెంటనే తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు సమీపంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.