సిటీబ్యూరో: జాతక దోష నివారణ చేసుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుందంటూ నమ్మించిన సైబర్‌చీటర్స్.. ఓ నిరుద్యోగికి రూ. 15 లక్షలు టోకరా వేశారు. మౌలాలికి చెందిన నిరుద్యోగుడు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా సాయిచరణ్ 12 ఎం, అస్ట్రోచరన్ అనే ఖాతాల నుంచి సందేశాలు వచ్చాయి. జాతకం చెబుతామంటూ.. అందులో మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని వాట్సాప్‌లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో సాయిచరణ్ బాధితుడితో మాట్లాడుతూ ‘నీకు కొన్ని జాతక దోషాలున్నాయి.. వాటిని నివారించుకుంటే.. నీకు ఉద్యోగం రావడంలో సహాయపడుతుందం’టూ నమ్మించాడు. ‘రూ. 50 వేలు పెట్టుకో నీకు వెంటనే ఉద్యోగం రాకపోతే చూసుకోమం’టూ నమ్మించి ఆ డబ్బు వసూలు చేశాడు.
కొన్ని పూజలు చేస్తానంటూ ఒకటి రెండు రోజుల సమయం తీసుకొని, ఓ ఫోన్ నంబర్ పంపించాడు. ‘ఈ నంబర్‌కు ఫోన్ చెయ్యి.. నీకు ఉద్యోగం పక్కాగా వస్తుందం’టూ సూచించాడు. బాధితుడు ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో తాను హెచ్ఆర్ మేనేజర్‌నని, ‘మీరు రిజ్యూమ్ పంపించండి’ మీకు ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నిద్దామంటూ సూచనలు చేశారు. పది రోజుల సమయం తీసుకొని ‘మీ రెజ్యూమ్ ఒకే అవుతున్నది. మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాం అయితే రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుందం’టూ చెప్పారు. బాధితుడు నిజమని నమ్మి.. దఫ దఫాలుగా ఆ డబ్బు చెల్లించాడు.
ఈ క్రమంలోనే మధ్యలో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని, టెక్నికల్ ఇంటర్వ్యూ అంటూ ఫోన్లో సైబర్ నేరగాళ్లు మాట్లాడుతూ ‘మీకు కాగ్నింజెట్ నుంచి హెచ్ఆర్ విభాగం నుంచి ఫోన్ చేస్తారం’టూ సూచించారు. ఓ మహిళ ఫోన్ చేసి తాను హెచ్ఆర్ విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ వివరాలు అడిగి ‘మీకు త్వరలోనే ఆఫర్ లెటర్ పంపిస్తామం’టూ ఫోన్ పెట్టాశారు. త్వరలోనే ఇస్తామంటూ వాయిదాలు వస్తూ వస్తుండడంతో సాయిచరణ్‌కు ఫోన్ చేసి అడగడంతో ‘నీవు హెచ్ఆర్ వాళ్లతో మాట్లాడుకో ఏదైనా ఆఫర్ లెటర్లలో ఇష్యూ ఉందేమో చెక్ చేసుకోమం’టూ సూచించారు. ఇటీవల ఆఫర్ లెటర్ వద్దని తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలంటూ కోరడంతో ఇచ్చేస్తామంటూ చెప్పి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు.. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
విదేశీ బ్యాంక్ ప్రతినిధులమని చెప్పి అత్యధిక లాభాల ఆశ చూపిన సైబర్‌నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 29.7లక్షలు కొట్టేశారు. సోమాజిగూడకు చెందిన 85 ఏండ్ల రిటైర్డ్ ఎల్ఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్‌కు సింగపూర్‌కు చెందిన ఓ మహిళ బ్యాంక్ అసిస్టెంట్ సీఈవోగా తనను తాను పరిచయం పరిచయం చేసుకొని వాట్సాప్‌లో అక్టోబర్ 8న ’83 డీబీఎస్ ఇండియా వెల్త్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ ’గ్రూపునకు యాడ్ చేశారు.
అందులో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు వచ్చిన స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తుండడంతో బాధితుడు ఆశపడి వారు చెప్పిన వేర్వేరు అకౌంట్లకు నవంబర్ రెండోవారం నుంచి డబ్బులు పంపించడం ప్రారంభించారు. ఒక నకిలీ స్టాక్ ట్రేడింగ్ వేదిక ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీలు, రెస్టారెంట్లకు చెందిన అకౌంట్లకు అతను నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4వ తేదీ మధ్య రూ. 29.7లక్షలు పంపించారు. దీంతో నేరగాళ్లు బాధితుడి అకౌంట్లో రూ.87.33 లక్షలు ఉన్నట్లు చూపించి.. వాటిని విత్ డ్రా చేసుకోవాలంటే మరో రూ. 6.78 లక్షలు ఇన్‌కమ్‌టాక్స్ కోసం చెల్లించాలని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 66సీ, 66డీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, బీఎన్ఎస్ 318,319,338,340 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.