రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఆదివారం ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మంచిర్యాల జిల్లాలో 84.59 శాతం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఎన్నికల సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, మొదట వార్డులు.. ఆపై సర్పంచ్ల ఫలితాలు వెల్లడించింది. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించింది. విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందించింది.
మంచిర్యాల, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో రెండో విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్, వేమనపల్లిలో మండలాల్లో 111 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. ఏడు మండలాల్లో 1,37,382 మంది ఓటర్లుండగా, 1,16,205 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 84.59 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి పర్యవేక్షించామని, ఎలాంటి చదురుముదురు ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.
బెల్లంపల్లి మండలం లింగాపూర్‌లో అత్యధికంగా 946, బుచ్చయ్యపల్లిలో 92.6, బట్వాన్పల్లిలో 91.2 శాతం పోలింగ్ నమోదైంది. భీమిని మండలం ఖర్జిభీంపూర్లో 94.86, కేస్లాపూర్లో 93.80, వెంకటాపూర్‌లో 93.19 శాతం, కన్నెపల్లి మండలం వీరాపూర్, గొల్లఘాట్లో 95.90 శాతం, వేమనపల్లి మండలం నాగారంలో 94.33, సుంపుటంలో 92.90, బుయ్యారంలో 91.30శాతం, కాసిపేట మండలంలో గ్రాటావ్పల్లిలో 94.82, సొనాపూర్లో 94.45 శాతం, తాండూర్ మండలం ద్వారకాపూర్‌లో 91,94, చౌటపల్లిలో 90.78 శాతం అత్యధిక పోలింగ్ నమోదైంది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 86.64 శాతం
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్-టీ మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఒకటి ఏకగ్రీవమైంది. మిగతా 112 గ్రామాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు. 1,31,278 మంది ఓటర్లకుగాను 1,13,733 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా 86.64 శాతం పోలింగ్ నమోదైంది. పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడ, చేడ్వాయి పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు.

