న్యూఢిల్లీ: నొప్పి నివారిణిగా పేరు పొందిన ట్రమడోల్ వల్ల గుండెకు ముప్పు ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. బీఎంజే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయన నివేదిక ప్రకారం& ట్రమడోల్‌ను సాధారణంగా నొప్పుల నుంచి ఉపశమనం కోసం వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. మరోవైపు ఇది గుండె జబ్బులు పెరగడానికి కారణమవుతోంది. ముఖ్యంగా సుదీర్ఘ కాలం వాడినపుడు ఈ ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనంలో 6,506 మందికి చెందిన క్లినికల్ ట్రయల్స్‌ను సమీక్షించారు. వీరి సగటు వయసు 58 ఏళ్లు. వీరు 2-16 వారాల పాటు ట్రమడోల్ మాత్రలను వాడారు.
దీనివల్ల నొప్పి నుంచి ఉపశమనం చాలా తక్కువేనని వెల్లడైంది. ప్లాసిబోతో పోల్చుకుంటే, ట్రమడోల్ వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు రెట్టింపు ఉంటాయని తెలిసింది. దీనికి కారణం ఛాతీ నొప్పి, కరోనరీ ఆర్టెరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత సమస్యలు పెరగడమేనని వెల్లడైంది. అమెరికాలో దాదాపు 5.16 కోట్ల మంది అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఈ నొప్పి నివారణ కోసం ట్రమడోల్‌ను విస్తృతంగా సూచిస్తున్నారు. దీని వాడకంపై పునః పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తున్నది.