బతుకంతా ఇక
నవ వసంతమే అని
ఒక విశాల
మౌన సామ్రాజ్య శ్వేత సౌధం
నీలి నీడలలో
ఆశల విహంగానివై
ఎగురుదామనుకొంటివి
ఎంత అమాయకత్వం..
తమ్ముడా
దూరపు కొండలు
కంటికే నునుపు
కాలికి నొప్పి అనే
కత్తిమొనను మరిస్తే ఎట్లా..
ఆ గడ్డ మీద వాడూ
వలస పక్షే అనే
బట్టలు లేని సత్యాన్ని
ఎప్పుడో విసర్జించినోడు
నీ సగటు మధ్యతరగతి
కడుపు నొప్పులు
వాడి పొగరు కండ్లకు
ఎలా కనిపిస్తాయి?
దిక్కులేని కళేబరాలను
రాబందులు పీక్కుతిన్నట్టు
బక్క పలుచని దేశాల
ఎంగిలి గిన్నెల ముందు
ఇనుప రెక్కలతో వాలిపోయే
అసలైన పరాన్నజీవి వాడు..
అడపా దడపా
ఏదో పాఠం చెప్పాలని కావచ్చు
కాలిఫోర్నియా కారడవి
ఒక దగ్ధ దేహమై
తనను తాను దహించుకొని
వాడు చేసే దౌష్ట్యాలకు
ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది..
అయినా వెర్రివాడా
చుట్టం చుట్టంలాగే కదా ఉండాలి
వసంతం కూడా
ఏడాదికి ఒక్కసారే కదా
వచ్చిపోయేది
మనది కాని నేల మీద
ఏ నిచ్చెన నెక్కుతావు..?
అమాయకుడా
నువ్వు చాప కింద నీరులాగ
ఒక నిశ్శబ్ద కెరటమై
తెలుపు నలుపులను
కమ్మేస్తుంటే
వాడి రొట్టెను తెలివిగా
నువ్వు దక్కించుకుంటే
పిచ్చోడి చేతిలో రాయిలాగ
కసి కోపం పిస్తోళ్ళై
గర్జించవా…
ప్రాణాలు తీయవా…?
కాలాన్ని భయం కొక్కానికి
తగిలించి ఎన్ని అడుగులేస్తవ్
ఆశలను అతికించి
నువ్వు పంపే డాలరు పక్షి
ఎన్ని కలలను సంతోషాలుగా
తర్జుమా చేస్తుంది?
నువ్వక్కడ
విద్వేషపు చూపుల
పలుగు రాళ్ల గాయాలకు
కనిపించని నెత్తురు ధారవైతుంటే
నిన్నొక నిత్య పారాయణం చేసుకొని
ఇక్కడ దిగులు మబ్బులై
మీ అమ్మా నాన్నలు
ఏకాంత దుఖఃమైతుంటే..
ఎవరి నోములు పండాలి..
ఎవరి బతుకులు పల్లవించాలి..
ఏ పరమార్థం కోసం..
ఏ వెలుగులకీ ప్రస్థానం..?
పచ్చడి మెత్కులో
పరమాన్నమో ఈన్నే తిందం
వచ్చెయ్ తమ్మీ… ఆల్చం జెయ్యకు.
(అమెరికాలో మనోళ్ళకు ఎదురైతున్న ఇబ్బందులకు స్పందించి..)
– అంకం మనోహర్ 94925 03339