శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు పుట్టగొడుగులు చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు కాపాడతాయి. ఈ చలికాలం పుట్టగొడుగులతో రకరకాల పదార్థాలు చేసుకొని, ఆరగించినట్లయితే.. రుచితోపాటు ఆరోగ్యాన్నీ పొందొచ్చు.
పుట్టగొడుగుల్లో యాంటి ఆక్సిడెంట్లు, బీటా – గ్లూకాన్ వంటి పోషకాలు ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చలికాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తినిస్తాయి. ఇందులో ఉండే సెలీనియం లాంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్లు.. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తాయి.
వీటిల్లో కేలరీలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. ఫలితంగా, గుండె జబ్బుల నివారణలో కీలకంగా పనిచేస్తాయి. మానసిక ఒత్తిడి, కీళ్ల నొప్పులు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు గట్టెక్కిస్తాయి.
పుట్టగొడుగుల్లో లభించే పాలీశాకరైడ్స్.. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా.. రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ నుంచి కాపాడటంలో పుట్టగొడుగులు ముందుంటాయి.
సోడియం తక్కువగా ఉండటంతో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ ముందుంటాయి. బరువు తగ్గించేందుకు, జీర్ణ సమస్యల నుంచి బయట పడేందుకూ పుట్టగొడుగులు సాయపడుతాయి. పేగుల ఆరోగ్యాన్ని కాపాడి.. జీర్ణ సమస్యల నుంచి విముక్తికల్పిస్తాయి.
మష్రూమ్స్‌లో రిబోఫ్లావిన్, నియాసిన్, పాంటోథినిక్ యాసిడ్లు, విటమిన్లూ.. ఎక్కువే! ఇవి జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి.