హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని పేర్కొంది. కారుణ్య నియామకానికి సంబంధించిన ప్రతిపాదనపై కింది అధికారులు స్పందించకపోవడంతో పెద్దపల్లికి జిల్లాకు చెందిన బీ శంకరయ్య రాష్ట్ర సమాచార కమిషన్లో అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై ఆగస్టు 29న విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసు అతనికి సెప్టెంబరు 3న అందింది. అయితే నిర్దేశిత తేదీన అతడు హాజరు కాలేదని చెప్పి ఫిర్యాదుపై విచారణను మూసివేసింది.
ఈ చర్యను సవాలు చేస్తూ శంకరయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, నోటీసు అందకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోయారని, పిటిషనర్ వాదనను వినకుండా ఫిర్యాదును మూసేయడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, సమాచార హకు కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. తాజాగా నోటీసులు జారీచేసి ఇరుపక్షాల వాదనలను విని మూడు వారాల్లో పిటిషనర్ ఫిర్యాదును పరిషరించాలని సమాచారహకు కమిషన్ను ఆదేశించింది.