సిటీబ్యూరో, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): విద్యార్థులు, యువతను డ్రగ్స్ ఊబిలోకి నెడుతున్న విద్యాసంస్థల సమీపంలోని పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విద్యాసంస్థల పరిసరాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’లో భాగంగా రెండురోజులుగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణాలపై 567 కేసులను నమోదు చేశారు. సుమారు రూ.1.10కోట్ల విలువైన నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు.
హైదరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో జోన్ల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా చార్మినార్ జోన్లో 119 కేసులు నమోదు కాగా, రాజేంద్రనగర్ జోన్లో 102, గోల్కొండ జోన్లో 98 కేసులు నమోదయ్యాయి. ఖైరతాబాద్‌లో 78, సికింద్రాబాద్‌లో 64, జూబ్లీహిల్స్‌లో 54, శంషాబాద్ జోన్లో 52 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు, యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై పోలీసులు కఠిన చట్టాలు ప్రయోగించారు. పట్టుబడిన ఉత్ప త్తు లు, దుకాణాదారుల నేర తీవ్రతను బట్టి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ -77,79 ప్రకారం కేసులు నమోదు చేశారు. సుమారు ఐదువేల మందికిపైగా పో లీసు సిబ్బంది ఏకకాలంలో సోదాల్లో పాల్గొనగా వీరిలో లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెం ట్ వింగ్, రిజర్వ్ పోలీస్, స్పెషల్ పోలీసు బృందాలు ఉన్నా యి.
డ్రగ్స్ రహిత సమాజం కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆపరేషన్ సేఫ్ స్కూల్‌ను ప్రారంభించామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. విద్యాసంస్థల సమీపంలో గుట్కాలు, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సులభంగా లభించడం వల్ల విద్యార్థు లు, యువత మొదట సరదాగా వాటికి ఆకర్షితులవుతున్నారన్నారు. నికోటిన్‌కు క్రమే ణా అలవాటుపడి, చివరకు డ్రగ్స్, గంజాయి వంటి తీవ్రమైన వ్యసనాల వైపు మళ్లే అ త్యం త ప్రమాదకరమైన పరిస్థితి ఉందన్నారు. ఈ తనిఖీలు ఇక్కడితో ఆగిపోవని, ఆపరేషన్ సేఫ్ స్కూల్ నిరంతరం జరుగుతుందని, విద్యాసంస్థల పవిత్రతను దెబ్బతీస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని సీపీ హెచ్చరించారు.
సోదాల సమయంలో విద్యాసంస్థల సమీపంలోని అనేక పాన్‌షాపులు, టీషాపులు, ఇతర దుకాణాలు, వాటి పరిసరాల ను అపరిశుభ్రంగా మారుస్తున్నాయని, తద్వారా ఆ ప్రాం తంలో ప్రయాణించే పిల్లలు, మహిళలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గమనించామన్నారు. ఏదైనా విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణా యజమానులందరూ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సీపీ సజ్జనార్ సూచించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే డయల్ 100కు గానీ, ఫోన్: 8712661601కు సమాచారం అందించాలని సీపీ తెలిపారు.