Benjamin Netanyahu : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ దేశం విడిచి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. నెతన్యాహు జర్మనీ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ప్రచారమవుతున్నాయి. దీనికో కారణం ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన హైసెక్యూరిటీ విమానం ‘వింగ్ ఆఫ్ జియోన్’ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో కనిపించింది.
అక్కడి బ్రాండన్‌బర్గ్ ఎయిర్‌పోర్టులో ‘వింగ్ ఆఫ్ జియోన్’ అనే విమానం ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన దృశ్యాల్ని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ విమానంలో నెతన్యాహు జర్మనీ రాజధాని బెర్లిన్ వెళ్లారని ప్రచారం మొదలైంది. సాధారణంగా ఒక దేశానికి చెందిన ప్రధాని, రాష్ట్రపతి వంటి అగ్రనేతలు ఇలాంటి విమానంలోనే ప్రయాణిస్తారు. అందువల్ల నెతన్యాహు కూడా ఆ విమానంలో అక్కడికి చేరుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇరాన్ దాడులకు భయపడి నెతన్యాహు దేశం విడిచి వెళ్లిపోయారని పాలస్తీనా అనుకూల వర్గాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. నెతన్యాహు టెల్ అవీవ్‌లోని కార్యాలయంలోనే ఉన్నారని వెల్లడించింది.
అక్కడి రక్షణ అధికారులతో ఒక హై సెక్యూరిటీ మీటింగ్‌లో నెతన్యాహు పాల్గొన్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆయన అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. అలాగే ఇరాన్ మిస్సైల్ దాడి చేసిన ప్రదేశాలను ఆయన పరిశీలిస్తున్న కొన్ని వీడియోల్ని కూడా పంచుకుంది. దీంతో నెతన్యాహు ఇంకా ఇజ్రాయెల్‌లోనే ఉన్నారని స్పష్టమైంది. ఆయన జర్మనీ వెళ్లారనే ప్రచారంలో నిజం లేదని తేలింది. కాగా.. కొన్ని భద్రతా కారణాలరీత్యా అధికారిక విమానం బెర్లిన్ వెళ్లినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.