హుజూరాబాద్: ఈటల రాజేందర్ గెలిస్తే కేవలం ఆయనకే లాభమని, కానీ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు కే వెంకన్న, డీసీసీ అధికార ప్రతినిధి సలీం నాయకత్వంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆబాదీ జమ్మికుంటలోని కాటన్ మిల్లులో జరిగిన కార్యక్రమంలో వీరికి మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కాటన్‌మిల్లులో పనిచేసే హమాలీలు ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ ప్రతిని మంత్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ జాతీయస్థాయిలో మాత్రమే పోటీపడతాయని, కానీ ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. అభాగ్యులందరికీ నెలనెలా సరిపోయే మొత్తం ఆసరా పింఛన్ అందజేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో కూడా రూ. 600 పింఛన్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రైతులకు రూ.5లక్షల ప్రమాదబీమా ఇక్కడ తప్పా మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఘనతకూడా మనకే దక్కుతుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ.. దేశానికే రోల్‌మోడల్ అని పేర్కొన్నారు. అందుకే మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు సర్పంచులు, నాయకులు తాము తెలంగాణలో కలుస్తామంటున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇటీవల తమను తెలంగాణలో కలిపిస్తే బాగుండు అని రాయచూరు ఎమ్మెల్యే కూడా అన్నారని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ ఎంతో ప్రేమతో పథకాలు పెడుతుంటే..కొందరు కక్షకట్టి ఆపేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దళితబంధు వద్దని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడని చెప్పారు. బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేకి అని ఆరోపించారు. బీజేపీ పాలిత గుజరాత్లో పనిగంటలు 8 నుంచి 12గంటలకు పెంచి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అలాగే, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు రాల్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటుందని పేర్కొన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు ఇక్కడి ప్రజలమీద ప్రేమ ఉంటే కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడే ఏ పనీ చేయని ఈటల ఇప్పుడు గెలిస్తే అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా తయారవుతుందన్నారు. అదే గెల్లు శ్రీనివాస్‌ను గెలిపిస్తే..తాను కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హుజూరాబాద్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.
హమాలీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం..: మంత్రి కొప్పుల ఈశ్వర్
హమాలీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. విషయం తెలిసి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరుతున్నవారందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. అందరం కలిసికట్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, కశ్యప్‌రెడ్డి, కోటి, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.