హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై వేటు వేయడం అంటే ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేయడం కాదని, తెలంగాణ ప్రజలగొంతు నొకడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షాన్ని వేధించడం, టార్గెట్ చేయడం కాదని, ప్రజల సమస్యలపై లోతుగా చర్చించి పరిష్కారం చూపడం అని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మూడు రోజులుగా సాగుతున్న సమావేశాల్లో ఒక ప్రజా సమస్యపైనైనా సమగ్ర చర్చ జరిగిందా? ఏ ఒక ప్రభుత్వ విధానంపైనైనా స్పష్టత ఇచ్చారా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని తెలిసి రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎన్నో ఆశలతో తమను కలిసి వందలాది వినతిపత్రాలు అందజేశారని హరీశ్‌రావు వెల్లడించారు. తమ బాధలను, సమస్యలను శాసనసభ వేదికగా లేవనెత్తాలంటూ ప్రజలు, ఉద్యోగులు, యువకులు నిరంతరం ఫోన్లు చేస్తూ మెసేజ్‌లు పెడుతున్నారని తెలిపారు. ప్రజలు తమ గొంతును అసెంబ్లీలో వినిపించాలని ప్రాధేయపడుతుంటే, చర్చ జరగకుండా తమను బలవంతంగా బయటకు పంపించి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో తీవ్ర ఇకట్లకు గురవుతున్నారని ఆరోపించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్టీసీ కార్మికులు, నిషేధిత జాబితా నుంచి తమ భూములను ఎప్పుడు తొలగిస్తారని రైతులు, జీవో 97ను ఎప్పుడు రద్దు చేస్తారని పాలిటెక్నిక్ విద్యార్థులు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. వీటితోపాటు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, డీఏ, పీఆర్సీ కోసం ఉద్యోగులు, కారుణ్య నియామకాల కోసం సింగరేణి కార్మికులు, పెన్షన్ల పెంపు కోసం వృద్ధులు కండ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారని, ఈ అంశాలన్నీ సభలో ప్రస్తావనకు వస్తే జవాబు చెప్పలేమన్న భయంతోనే ప్రభుత్వం తమను సస్పెండ్ చేసి పారిపోయిందని దుయ్యబట్టారు.
శాసనసభలో మైకులు కట్ చేసి, సభ్యులను సస్పెండ్ చేసి బలవంతంగా గొంతు నొకవచ్చేమో గానీ ప్రజాక్షేత్రంలో తమ గళాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని చూస్తే, ప్రజాసమస్యలపై బీఆర్ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పోరాడుతుందని తేల్చిచెప్పారు. అధికారం శాశ్వతం కాదని, నియంతృత్వ వైఖరితో ఎకువ కాలం ప్రజాస్వామ్యాన్ని బందీ చేయలేరని హెచ్చరించారు.
గతంలో తనకు హిట్లర్ ఆదర్శమని స్వయంగా చెప్పుకున్న రేవంత్‌రెడ్డి, నేడు అదే తరహా నియంతృత్వ పోకడలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నిరంకుశ పాలకులు చరిత్ర ఇచ్చే తీర్పు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలను రాష్ట్ర ప్రజలు అత్యంత నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయమూర్తులు ప్రజలేనని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెడతారని హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలు, లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం దాటవేత ధోరణి వీడి స్పష్టమైన సమాధానం చెప్పేంతవరకు బీఆర్ఎస్ వెనకితగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. పాలకులలో నియంతృత్వం ఎంతగా ముదిరితే, ప్రజల నుంచి తిరుగుబాటు అంత బలంగా పెల్లుబుకుతుందన్న నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.