హైదరాబాద్, ఫిబ్రవరి 12 ( నమస్తే తెలంగాణ) : ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. 16 వేల మంది హోంగార్డులకు 12 రోజులు గడుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని ‘ఎక్స్’లో ఫైర్ అయ్యారు. ‘తక్కువ జీతాలపై ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల సూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి. ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న దుస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెల ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి వీరికి ఏం సమాధానం చెబుతారు?’ అంటూ నిలదీశారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండాఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అంటూ మండిపడ్డారు. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ర్టాలు మరింత వృద్ధి చెందేలా చేయూతనివ్వాలని దక్షిణాది రాష్ర్టాలు డిమాండ్ చేస్తుంటే ‘చోటీ సోచ్’ అంటూ కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి చోటీ సోచ్‌కు ఇది నిదర్శనమని చురకలంటించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ర్టాలకు ఇవ్వాలని, సెస్సులు, సర్‌చార్జీలు విధించడం వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని, వెరసి 41 శాతంలో రాష్ర్టాలకు వాస్తవంగా అందుతున్నది 30 శాతం మాత్రమేనని వివరించారు. తమకు అనుకూలంగా లేని రాష్ర్టాలకు కేంద్రం మొండి చెయ్యి చూపటం పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఆర్థిక అధికారాలు తమ వద్ద పెట్టుకొని రాష్ర్టాలపై పెత్తనం చేయాలని చూస్తున్నదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇదేనా టీమ్ ఇండియా స్ఫూర్తి? అని నిలదీశారు. రాష్ర్టాల హకుల గురించి మాట్లాడుతుంటే అవమానకరంగా మాట్లాడటం తగదని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్‌కు సూచించారు.