హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈటల రాజేందర్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి వైద్య, ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతి కొనసాగిన సమయంలో ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు ఈ శాఖ వ్యవహారాలను చక్కదిద్దారు. కరోనా కట్టడి, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్, ఇతర మౌలిక సదుపాయాలపై పలుమార్లు వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించారు. నెల వారీ లక్ష్యాన్ని నిర్దేశించి రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగేలా కృషిచేశారు.
కరోనా సమయంలో పలు దవాఖానలను సందర్శించి రోగులకు అందుతున్న చికిత్స, వసతులను పరిశీలించారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిన సందర్భంలో కోఠిలోని ఈఎన్టీ దవాఖానను సందర్శించి, అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావుకే వైద్య, ఆరోగ్యశాఖను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.