నిరసన తెలిపే హక్కు పోయి నిరంకుశమే రాజ్యమేలింది. హైడ్రా కూల్చివేతలతో పేదల బతుకులను ఛిద్రం చేసి, మూటల కోసం మూసీ ప్రక్షాళన చేపట్టి, లగచర్ల గిరిజనులపై థర్డ్ డిగ్రీలు ప్రయోగించి, రైతుబంధుకు రాంరాం చెప్పి, బోనస్‌ను బోగస్ చేసి, సాగును సంక్షోభంలోకి నెట్టి, వృద్ధుల పింఛన్లకు ఎగనామం పెట్టి, పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించిన ఘనుడు రేవంత్‌రెడ్డి.
Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు కన్నీళ్లు, ప్రజాస్వామ్య హననం తప్ప సాధించినది ఏమీలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదని, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని గొప్పలు చెప్పి హక్కుల హననానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఏడాది పాలనలో సమస్త ప్రజా పీడన పరాయణత్వం తప్ప మరేమీ లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి కాంగ్రెస్ పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరిట హరీశ్‌రావు చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియోలు చూపుతూ పంచ్‌లు, సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని, నిరసన తెలిపే హక్కు పోయి నిరంకుశమే మిగిలిందని దుయ్యబట్టారు. స్కూళ్లు, హాస్టళ్ల ముందు పికెట్లు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరికి వెళ్లేందుకు కూడా పోలీస్‌స్టేషన్‌లో అనుమతి తీసుకొనే దుస్థితి తెచ్చారని నిప్పులు చెరిగారు. ‘హైడ్రా పేరిట కూల్చివేతలు మొదలు పెట్టి పేదల బతుకులను ఛిద్రం చేసి, మూటల కోసం మూసీ ప్రక్షాళన చేపట్టి, లగచర్ల గిరిజనులపై థర్డ్ డిగ్రీలు ప్రయోగించి, రైతుబంధుకు రాంరాం చెప్పి, బోనస్‌ను బోగస్ చేసి, సాగును సంక్షోభంలోకి నెట్టి, వృద్ధుల పింఛన్లకు ఎగనామం పెట్టి, పోలీసులతోనే పోలీసుల కుటుంబాలను కొట్టించిన చేసిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రతిపక్షాలపై తిట్లు, దేవుళ్లపై ఒట్లు.. ప్రశ్నించిన ప్రజలకు కొట్లు, తన వారికి దోపిడీ పేరిట నోట్లు.. ప్రశ్నించిన మీడియా, సోషల్ మీడియాపై ఆంక్షలు, కేసులు పెట్టడం తప్ప సాధించినదేమీలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రాజకీయ కక్షతో కేసులు పెట్టడం, న్యాయస్థానాల్లో వీగిపోవడం రివాజుగా మారిందని పేర్కొన్నారు. లాఠీచార్జిలు చేయించి నిరుద్యోగల కన్నీళ్లతో అశోక నగరాన్ని శోక నగరంగా మార్చారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ అని మ్యానిఫెస్టోలో పెట్టి ఒక్కరోజు బాగోతంతో ఒడగొట్టి ఉత్త ప్రహసనంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి నెగెటివ్ ఆటిట్యూడ్‌తో పాలనను మొదలు పెట్టడంతో నెగెటివ్ ఫలితాలు వస్తున్నాయన్నారు. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కి, అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ‘దివాలా దివాలా అనే దిక్కుమాలిన ప్రచారంతో రాష్ట్ర పరపతి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపెట్టుబడులు దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని, నిర్మాణ రంగం కుదేలైందని, రియల్ ఎస్టేడ్ ఢమాలైందని విమర్శించారు.
రేవంత్ పాలనలో మంత్రుల మధ్య సమన్వయం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఆయన నిర్వహిస్తున్న హోం, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు పెంచలేదనే కారణంతో 39 మంది ఎైక్సెజ్ సీఐలకు మెమోలు ఇవ్వడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో కన్విన్షన్, కన్సిస్టెన్సీ, కాన్సెంట్రేషన్ లేదన్న విషయం అర్థమవుతున్నదని ఎత్తిచూపారు. ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తితే ముగ్గురు మంత్రులు ఉండి కూడా సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని చెప్పారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి దాడులు చేయించారని ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డి విపత్తు నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ అయి.. ఏడుగురి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో, అలజడితో అట్టుడుకుతున్నదని హరీశ్‌రావు అన్నారు. మతసామరస్యానికి మారుపేరుగా నిలిచిన రాష్ట్రంలో మత ఘర్షణలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా కక్ష సాధింపు ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. ‘రేవంత్ బ్రదర్స్ వేధింపులవల్లే చనిపోతున్నానని ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి సూసైడ్ లెటర్ రాసి మరణించాడు. కానీ ఈ ఘటనపై విచారణలేకపోవడం రేవంత్ మార్క్ పాలనకు అద్దంపడుతుందని తూర్పారబట్టారు. చట్టం కాంగ్రెస్‌కు చుట్టమైపోయిందని విమర్శించారు.
‘హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలున్నాయట. అందుకే నేవీ రాడార్ కేంద్రం దామగుండంలో పెడుతున్నారట. రాష్ట్రం చుట్టూ మూడు సముద్రాలు లేవు గానీ, ముఖ్యమంత్రి గారికి మాత్రం సముద్రమంత అజ్ఞానం ఉందని జనం నవ్వుకుంటున్నరు. తెలంగాణలో భాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని ముఖ్యమంత్రి నొకి వకాణించారు. భాక్రా-నంగల్ అనేవి రెండు ప్రాజెక్టులు. అవి హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. అవి ఉన్న ప్రదేశాలను బట్టే వాటికి ఆ పేరు వచ్చింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారట. ఈ మాటన్నది సాక్షాత్తూ సీఎం గారే.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హామీ ఇచ్చిన పథకాలతో పాటు అనేక స్కీంలు తెచ్చి కేసీఆర్ స్వర్ణయుగం సృష్టించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, ఆరు గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ప్రతినెలా రూ. 2500 ఇవ్వకుండా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయకుండా దగా చేశారని మండిపడ్డారు. ఏడాదిలో కట్టిన ఇండ్లు కూల్చడం తప్ప ఒక్కటి కూడా కట్టలేదని ఆరోపించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ఉన్న బస్సులను తీసివేశారని ఆరోపించారు. బస్సుల సంఖ్య తగ్గించడంతో మహిళలు, పురుషులు పడరానిపాట్లు పడుతున్నారన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన అప్పు రూ.4.26 లక్షల కోట్లను రూ. 7 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి కేసీఆర్ పదేండ్లు కాపాడిన హక్కులను కేంద్రానికి కట్టబెట్టారని ఆరోపించారు. ‘కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది’ అని ఎద్దేవా చేశారు.
రుణమాఫీపై మొదటి సంతకం పెడతానని చెప్పిన రేవంత్‌రెడ్డి తాను ప్రమాణం చేసి రైతులకిచ్చిన ప్రమాణపత్రం నిలుపుకోలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసినట్టు మూడు కోట్ల దేవుళ్లను మోసం చేస్తూ కేవలం 50 శాతం మందికే మాఫీ చేసి మిగిలిన రైతులకు టోపీ పెట్టారని మండిపడ్డారు. అడ్డగోలు నిబంధనలతో పంచాయితీలు పెట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. పంటల బోనస్‌ను సన్నాలకే పరిమితం చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నరని విమర్శించారు. ఉపాధి కూలీలకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జబ్బలు, బల్లలు చరిచి, తొమ్మిది నెలలు గడిచినా ఒక్క అణా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగుల రెక్కల కష్టంతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని అడిగిన పాపానికి లాఠీలు ఝళిపిస్తూ దమనకాండకు దిగుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెడితే, నియామక పత్రాలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి తన ఘనతగా చెప్పుకోవడం దౌర్భాగ్యమని దుమ్మెత్తిపోశారు. అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్‌గా మారిందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ పాలనలో సకల వసతులు, నాణ్యమైన విద్యతో వర్ధిల్లిన గురుకులాలకు రేవంత్ పాలనలో గ్రహణం పట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ సన్నబియ్యంతో చక్కని బువ్వ పెడితే రేవంత్ మాత్రం పురుగుల అన్నం వడ్డిస్తున్నారని ఆరోపించారు. పాము, కుక్క, ఎలుక కాట్లు, కరెంట్షాక్లతో విద్యార్థులు దవాఖానల పాలవుతుంటే ప్రభుత్వం పరువు గంగపాలవుతున్నదని దుయ్యబట్టారు. బడుల్లో ఆనందంగా చదువుకోవాల్సిన పిల్లలు దవాఖానల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడటం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు. 49 మంది గురుకుల పిల్లలను బలితీసుకొని తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారని వాపోయారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పాజిటివిటీ ప్రగతి పరుగులెత్తిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. 2014లో రూ. 62 వేల కోట్లు ఉన్న బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లకు, రూ. 5 లక్షల కోట్లు ఉన్న జీఎస్డీపీ రూ. 14.5 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. రూ. 1.24 లక్షలు ఉన్న తలసరి ఆదాయం రూ. 3.47 లక్షలకు, రూ. 27వేల కోట్ల సేల్స్ ట్యాక్స్, రూ. 73 వేల కోట్లకు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 2.5 వేల కోట్ల నుంచి సుమారు రూ. 13వేల కోట్లకు, రూ. పదివేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు రూ. 3.33 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. ఇలా కేసీఆర్ మార్క్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిస్తే, రేవంత్ మార్కు పాలన దేశం ముందు నవ్వుల పాలైందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో పచ్చదనం, పరిశుభ్రతతో విలసిల్లిన గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ గాలిలో దీపంలా మారిందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను మళ్లిస్త్తూ కార్యదర్శులపై ఆర్థిక భారం మోపుతున్నదని ఆరోపించారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలిచ్చి ఏడాది పాలనలో వారిని అడుగడుగునా దగా చేశారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు డీఏలు ఇస్తానన్న రేవంత్ ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సరెండర్ లీవ్, టీఏ బిల్లుల కోసం పోరాటం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడువేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు ఎగబెట్టి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
హైడ్రా పేరిట కూల్చివేతలు చేపట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పేదల ఇండ్లు పడగొట్టిన రాకాసి రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం’ అని విమర్శించారు. ప్రశ్నించే వారిపై నుంచి బుల్డోజర్ నడుపుతా అని వీధి రౌడీలా బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. రూ. 16వేల కోట్ల బృహత్ ప్రణాళికతో మూసీని జీవనదిగా మార్చేందుకు కేసీఆర్ ఎప్పుడో నడుం బిగించారని చెప్పారు. అప్పట్లోనే 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరిగిందని గుర్తుచేశారు. రూ. 16 వేల కోట్లతో బీఆర్ఎస్ రూపొందించిన పథకాన్ని పకనపెట్టి రూ. 1.5 లక్షల కోట్లు లూటీ చేసే కొత్త పథకాన్ని సిద్ధం చేసి ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి తీసుకొస్తున్న ఈ పథకాన్ని మూసీ ప్రక్షాళన పథకం అనేకన్నా ‘ప్రజల సొమ్ము భక్షాళన పథకం’ అనడం సబబుగా ఉంటుందని ఎద్దేవా చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం సేకరించిన భూములు వాడుకోనప్పుడు వెంటనే వాపస్ చేయాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార, సీతక, కోదండరెడ్డి నాడు ఫార్మాసిటీ భూములను వాపస్ ఇస్తామని ప్రచారంలో ఊదరగొట్టారని గుర్తు చేశారు. నేడు అధికారంలోకి రాగానే నిర్బంధాల నడుమ 30 వేల ఎకరాల భూములు సేకరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాలు కాదని, ఫార్మా కంపెనీలను పల్లెలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన బిడ్డల మీద దారుణమైన అణచివేతను ప్రయోగిస్తూ ఎమర్జెన్సీ కాలం నాటి పోలీసు రాజ్యాన్ని తెచ్చారని విమర్శలు గుప్పించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే రేవంత్ రెడ్డి మాటమారుస్తూ లగచర్ల లంబాడీల దెబ్బకు జడిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎకడ నిరసన చెలరేగినా, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడినా ప్రతిపక్షం కుట్ర అని ప్రచారం చేయడం రేవంత్‌రెడ్డికి రివాజుగా మారిందని హరీశ్‌రావు మండిపడ్డారు. వరద బాధితుల నుంచి హైడ్రా బాధితుల దాకా లగచర్ల నుంచి దిలావర్ పూర్ వరకు, నిరుద్యోగుల నుంచి పోలీసుల దాకా ఎవరు రోడ్డెకినా వారి వెనుక ప్రతిపక్షమే ఉందంటూ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా ప్రతిపక్షాల కుట్ర అంటున్న రేవంత్‌రెడ్డికి కొంచైనా జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ పదేపదే తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదట. అబద్ధమాడినా అతికినట్టుండాలి కదా? జీతం పద్దులు చూసే ్తరూ. 1.6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఎవరికైనా అర్థమవుతుంది. మల్లన్న సాగర్‌లో 50 వేల ఎకరాలు మునిగాయని, నిర్వాసితులకు ఒక ఇల్లు కట్టలేదని నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పిండు. 14వేల ఎకరాలకు మించి మునగలేదని, మూడు వేలకు పైగా ఇండ్లు కట్టారని రికార్డులు చూసినా, అకడికి వెళ్లినా తెలుస్తుంది కదా. దావోస్‌కు పోయిన ముఖ్యమంత్రి విదేశాల్లో కూడా తన అజ్ఞానాన్ని దాచుకోలేదు. ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఐటీ సెక్టార్ అండ్ ఫార్మా సెక్టార్ ఈజ్ ఏ న్యూక్లియర్ చైన్ రియాక్షన్’ అని అభాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఏడాది పాలన తెలంగాణ ప్రజలను సంపూర్ణంగా హతాశులను చేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పదేండ్ల అభివృద్ధిని పన్నెండు నెలల్లో పాడు చేసిన్రు. పురోగమన తెలంగాణను తిరోగమన తెలంగాణగా మార్చిన్రు. సంక్షేమం కునారిల్లింది. సంక్షోభం ముంచుకొస్తున్నది. అభివృద్ధి జాడలేదు, అణిచివేత విరుచుకుపడుతున్నది. మొత్తం మీద ఏడాది పాలన ఎడతెగని వేదననే మిగిల్చింది. రేవంత్ మార్క్ ప్రజా పాలన ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో వర్ధిల్లుతున్నది’ అని విరుచుకుపడ్డారు.
ఏడాది పాలనలో ఏం కోల్పోయామో ప్రజ లు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని కేసీఆర్ అన్న మాట అక్షర సత్యమని హరీశ్ స్పష్టం చేశారు. ‘సత్యాన్ని జీర్ణించుకోలేని రేవంత్ ఎగతాళిగా మాట్లాడుతున్నరు. ఎగిరెగిరి పడుతున్నారు. వ్యవసాయానికి జీవనాడిగా నిలిచిన రైతుబంధును రైతులు కోల్పోయారు. మత్స్యకారులు చేప పిల్లల పంపిణీని, దళితులు దళితబంధు, బీసీలు బీసీబంధు, బడుగు బలహీన వర్గాల వి ద్యార్థులు ఓవర్సీస్ సాలర్షిప్లు. గర్భిణులు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు, మైనార్టీలు క్యాబినెట్లో స్థానం, షాదీ ముబారక్ కోల్పోయారు. లంబాడ బిడ్డలు మంత్రివర్గంలో స్థానం, పేద బ్రాహ్మణులు సర్కారు సాయం, ఇండ్లు కూలిన పేదలు సర్వస్వం, చివరకు అమ్మ ఒడిలోనో, బడిలోనో ఆనందంగా ఉండాల్సిన పిల్లలు తమ విలువైన ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రజలు ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు. వెరసి ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తాతా మధు, తకళ్లపల్లి రవీందర్రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవిప్రసాద్, గజ్జల నగేశ్, మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మట్లాడే విధానానికి ఆయనకు ‘దుర్భాషా దురంధరుడు’ అనే బిరుదు ఇవ్వవచ్చని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘పండబెట్టి తొకుతా.. చీరుతా.. చింపుతా.. సంపుతా.. గుడ్లు పీకి గోటీలాడతా.. యాప శెట్టుకు కట్టేసి లాగుల తొండలిడుస్తా’ అని శాడిస్టు భాషలో చెలరేగి పోతున్నారన్నారు. బుల్డోజర్తో తొకిస్తం. మానవ బాంబులై చంపేస్తం అని టెర్రరిస్టులా రెచ్చిపోతారని మండిపడ్డారు. ‘నా కొడకల్లారా.. ఒకొకడ్ని పండబెట్టి తొకి పేగులు తీసి మెడలో వేసుకొని ఊరేగుతా’ అంటూ ఉన్మాదిలా వాగుతారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాడీ షేమింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని చురకలంటించారు. పసిపిల్లలను సైతం బాడీ షేమింగ్ చేసిన ఘనత కలిగిన రేవంత్‌రెడ్డికి తన లాంటి వాళ్లను చేయడంలో పెద్దగా ఆశ్చర్యం లేదన్నారు. ఎప్పుడో ఓసారి మాట తూలడం సాధారణమేనని, ఎప్పుడూ బూతులే మాట్లాడటం రేవంత్‌కు రివాజుగా మారిందని విమర్శించారు. రాజకీయ పరిభాషను దిగజార్చడంలో రేవంత్‌రెడ్డి సిద్ధహస్తుడన్నారు.
‘రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టగానే రాగానే ఎయిర్పోర్ట్, మెట్రోరైల్, ఫార్మాసిటీ రద్దు.. హైదరాబాద్‌లో వ్యాపారాలు రాత్రి 10 గంటలకు బంద్ అన్నడు. హైడ్రా కూల్చివేతలతో అరాచకం సృష్టించాడు. ఆపై నాలుక కరచుకొని అంతా తూచ్ అన్నడు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయన తీరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ అయిందని విమర్శించారు. ఆయన అపరిపక్వ వైఖరితో రాష్ట్ర ప్రగతి మసకబారిందని ధ్వజమెత్తారు. రేవంత్ తత్తర బిత్తరగా ప్రభుత్వం నడుపుతూ ఏడాదిలో ముగ్గురు పోలీసు కమిషనర్లు, ముగ్గురు జీహెచ్ఎంసీ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు కలెక్టర్లను, ట్రాన్స్‌కోకు నలుగురు సీఎండీలను తెచ్చి పాలనా వైఫల్యాన్ని చాటుకున్నారని దెప్పిపొడిచారు.