హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌కు అనుబంధంగా జిల్లా కలెక్టరేట్లలో ‘హెల్ప్‌డెస్క్’లను ఏర్పాటు చేయనున్నారు. పోర్టల్‌లోని మాడ్యూల్స్, భూ సమస్యల పరిష్కారంపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మీసేవ కేంద్రంలో మాదిరిగా దరఖాస్తులను అప్లోడ్ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు క్యాబినెట్ సబ్‌కమిటీ సూచించింది. ధరణిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బీఆర్కే భవన్లో రెండోసారి బుధవారం సమావేశమైంది. దీనికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత వహించారు. ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి చేయాల్సిన మార్పులపై చర్చించారు. నిషేధిత జాబితాలో ఉంచిన భూములపై ఇప్పటివరకు 98,049 దరఖాస్తులు రాగా, వాటిలో 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేసినట్టు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పలు భూ సమస్యల పరిష్కారానికి పోర్టల్‌లో ఇప్పటికే అనువైన మాడ్యూల్స్‌ను, ఆప్షన్స్‌ను పొందుపరిచామని వివరించారు. వీటిపై సరైన అవగాహన లేక సమస్యలు పరిషారం కావడంలేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్లపై అధికారులు, మీసేవ కేంద్రాల నిర్వాహకులకు జిల్లాస్థాయిలో ఒకరోజు శిక్షణ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. జడ్పీ, మున్సిపల్ సమావేశాలకు కలెక్టర్లు హాజరై ధరణిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. ధరణిపై అవగాహన కల్పించి, అక్కడే దరఖాస్తు చేసేలా కలెక్టరేట్లలో ‘ధరణి హెల్ప్‌డెస్’లను ఏర్పాటుచేయాలని సూచించారు. భూరికార్డుల నమోదులో జరిగిన పొరనాట్లను సవరించేందుకు మరిన్ని మాడ్యూల్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను కోరారు. వచ్చే వారం మరోసారి సమావేశం కావాలని ఉపసంఘం నిర్ణయించింది. సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబిత, వేముల ప్రశాంత్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.