చిన్నకోడూరు, నవంబర్ 6: వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుసార్లు ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపినా, కేంద్రం వైఖరిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ వద్ద నాలుగేండ్లకు సరిపడా ధాన్యం ఉన్నదని, ఈ యాసంగిలో వడ్లు కొనలేమని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) లేఖ రాసిందని చెప్పారు. ఉప్పుడు బియ్యం కొనబోమని ఎఫ్‌సీఐ చెప్తున్నదని తెలిపారు. శనివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మాచాపూర్, చౌడారం గ్రామాలకు చెందిన 750 మంది రైతులకు సన్‌ఫ్లవర్ విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన పంట మొత్తం కొనడానికి రూ.20 వేల కోట్లు, కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, కానీ పండిన పంటను ఎక్కడ పెట్టాలన్నదే సమస్యగా మారిందని వివరించారు. ఒకవైపు స్థల లేమి, మరోవైపు హమాలీల కొరత కారణంగా అడ్వాన్స్‌లు ఇచ్చి బీహార్ నుంచి రప్పిస్తున్నామని తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగుచేయాలని ఉద్బోధించారు. తెలంగాణ మరింత సమృద్ధి సాధించాలంటే లాభాలను అందించే ఇతర పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. నూనె గింజల ఉత్పత్తిలో వెనుబడినందున మన దేశం ఏటా రూ.90 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కోల్పోతున్నదని పేర్కొన్నారు. పామాయిల్ సాగు లాభసాటిగా ఉన్నదని, దానివైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. నూనె గింజలతోపాటు, పప్పు దినుసుల సాగుకు రైతులు ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, జిల్లా అటవీశాఖ డైరెక్టర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.