సిద్దిపేట, జూలై 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి పనులన్నీ కుంటుపడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేట కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ డీడీఆర్సీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై ఆయన అధికారులు, జిల్లా మంత్రిని ప్రశ్నించారు. పనుల జాప్యం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన డీడీఆర్సీ మీటింగ్ సకాలంలో జరగక సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. జిల్లాలో పంచాయతీరాజ్ లాంటి కీలక శాఖల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉండటంతో పనులు కుంటుపడుతున్నాయని, కావాలనే ప్రభు త్వం సిద్దిపేటకు అధికారులను పంపించడం లేదన్నారు. విద్యుత్‌శాఖ అధికారులు జిల్లా సమీక్ష కోసం కేవలం ఒక పేజీ నోట్ ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రైతులకు కనీసం 14 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నారు.
రైతులకు అందాల్సిన యూరియా పకదారి పడుతోందని, యాప్ ఓపెన్ చేసేలోపే స్టాక్ అయిపోయిందని మెసేజ్ వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని హరీశ్‌రావు చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా జీలుగు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. యాసంగి బోనస్ డబ్బు లు వెంటనే ఇవ్వాలన్నారు. ముగ్గురు మంత్రు లు వచ్చి పరిశీలించినా.. వడగండ్లకు నష్టపోయిన రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదన్నారు. వ్యవసాయ మారెట్ శాఖలో బిల్లులు రావడం లేదని, మారెట్ కమిటీ చైర్మన్లకు 7 నెలలుగా జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కింద జిల్లాలో 2,490 ఇండ్లు పూర్తయితే, కేవలం 4 ఇండ్లకు మాత్రమే పూర్తి స్థాయి రూ. 5 లక్షల బిల్లు ఇచ్చారన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మంత్రి చెబుతున్నారు.. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకుపోవడానికి రూ. 8 వేల కోట్లు ఎకడి నుంచి తెచ్చారని సూటిగా మంత్రిని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ప్రభు త్వ సూ ళ్లలో 4 వేల మంది విద్యార్థులు తగ్గారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు ఇది నిదర్శనమన్నారు.బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సిద్దిపేట జిల్లాకు ఎందుకు వర్తింపజేయడం లేయడం లేదన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఇంకా విద్యార్థులకు సూల్ యూనిఫామ్స్, బుక్స్, గురుకులాల్లో బెడ్ షీట్లు, ప్లేట్లు, గ్లాసులు రాలేదన్నారు.
సిద్దిపేట టౌన్‌లోని ఐదు బస్తీ దవాఖానల్లో డాక్టర్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, టీ-డయాగ్నోస్టిక్ సేవలు కుంటుపడ్డాయని హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లను పట్టణాలు, హైదరాబాద్‌కు డిప్యూటేషన్‌పై పంపుతున్నారన్నారు. గ్రామాల్లో పేదలకు వైద్యం అందడం లేదన్నారు. రెండేండ్లుగా సిద్దిపేట జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
నంగునూరు పెద్దవాగులో ఇసుక మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా మంత్రి వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకొని సమస్య పరిషరించాలి, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయా ంలో మహిళలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జిల్లా సమైక్య భవనం, సఖీ సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్, వరింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాలు నిర్మించామని గుర్తుచేశారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ నిలిచిపోయిందని హరీశ్‌రావు అన్నా రు. పిల్ల కాల్వల నిర్మాణం జరిగితేనే పొలాలకు నీళ్లు అందుతాయని చెప్పారు. కేవలం రూ. 50-60 కోట్లు కేటాయిస్తే సిద్దిపేట జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కాల్వల పనులు పూర్తయి చివరి ఎకరం వరకు నీళ్లు అందుతాయన్నారు. భూసేకరణపై హైకోర్టులో ఉన్న స్టేను వెకేట్ చేయించాలన్నారు. గుర్రాలగుంది, విట్టలాపూర్ గ్రామాల వద్ద సిద్దిపేట-సిరిసిల్ల రైల్వే లైన్ పనులు కనెక్ట్ కాబోతున్నాయన్నారు. సిద్దిపేట-చిన్నకోడూరు రోడ్డు పనులు రెండేండ్లుగా ఆగిపోయా యన్నారు.. సిద్దిపేట రింగ్‌రోడ్డు పనులు సగంలోనే ఆగిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సూర్యాపేట-సిద్దిపేట-సిరిసిల్ల జాతీయ రహదారి పనులు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.