హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): 11 ఏండ్ల కార్టూనిస్ట్ శ్రీయాన్ శ్రీరంగంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చిన్న వయస్సులోనే ఆ బాలుడు గీసిన అద్భుతమైన కార్టూన్లను చూసి ఒకింత అశ్చర్యపోయారు. ‘శ్రీయాన్..శభాష్’ అంటూ మెచ్చుకున్నారు. శుక్రవారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాల కార్టూనిస్ట్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏడేండ్ల వయస్సులోనే కార్టూన్లు గీయడం ప్రారంభించిన శ్రీయాన్, ఉత్తమ కార్టూన్లతో ‘బ్రోచేవారెవరు బ్రో.. నను’ పేరిట పుస్తకాన్ని ప్రచురించడం గొప్పవిషయమని కేటీఆర్ కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.