అచ్చంపేట (అమ్రాబాద్), ఏప్రిల్ 7 : రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మా వద్ద కు వస్తే ఏం తెస్తారు మీ వద్దకు వస్తే ఏమి ఇస్తారు అన్నచందంగా పాలనను సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశా రు. సోమవారం అచ్చంపేటలోని తన నివాసంలో అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో ఎక్కడ చూసినా తాగునీరు, సాగునీరు సమస్యలతో ప్రజలు, రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు ప్రజలకు క్యాంప్ కార్యాలయాల్లో అందుబాటులో లేరని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో తాము ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్నామని ప్రజలతో క్యాంప్ కార్యాలయాలు కిటకిటలాడేవని ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన వరంగల్ ఎలుకతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభను జయప్రదం చేద్దామని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిచారని ఆయన గుర్తుచేశారు.
ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తీసుకొస్తే ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది, స్థానిక ఎమ్మెల్యేదీ అని ఆయన అన్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్స్‌లో ముఖ్యమంత్రి సొంత గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అక్కడి నుంచే గెలుపును ప్రారంభిస్తామని అన్నారు. కార్యకర్తలు ఎవరు కేసులకు భయపడకండని మీకు అంతా నేను, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నర్పింహగౌడ్, సీనియర్ నాయకులు అమీనొద్దీన్, కేటీ తిరుపతయ్య, అచ్చంపేట పీఏసీసీఎస్ చైర్మన్ మందా రాజిరెడ్డి, నాయకులు రాంబాబునాయక్, కరుణాకర్రా వు, నాగరాజు, కొత్త రవీందర్రావు, గణేశ్‌రావు, భూపాల్‌రావు, కుత్బుద్దీన్, అంజి, చెన్నకేశవులు పాల్గొన్నారు.