న్యూఢిల్లీ, మే 14: దేశంలో రెండు విభిన్న వాతావరణ ధోరణలు నెలకొన్నాయి. ఓవైపు దేశమంతటా వేసవి ఎండలు దంచి కొడుతుండగా.. మరోవైపు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాలలో ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో యూపీలోని ప్రయాగ్రాజ్, అయోధ్య సహా 31 జిల్లాల్లో గురువారం 104 మంది మృత్యువాత పడ్డారు.
ఒక్క ప్రయాగ్రాజ్ జిల్లాలోనే 21 మరణాలు చోటుచేసుకోగా, బదోహీలో 17 మంది మృతిచెందారు. బరేలీ జిల్లాలో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఓ యువకుడు ఇనుపరేకు సహా గాలిలోకి ఎగిరి కొంతదూరంలోని పొలాల్లో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కొన్ని చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు కూలి వాహనాలపై పడటం, పట్టణాల్లోని దుకాణాల పైనున్న రేకులు ఎగిరి పడటంతో పలువురు మృతి చెందగా, 53 మంది వరకు గాయపడినట్టు యూపీ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. వర్షం, ఈదురుగాలుల కారణంగా వందకుపైగా పశువులు కూడా మరణించినట్టు తెలిపారు. భారీస్థాయిలో ఆస్తినష్టం సంభవించిట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజస్థాన్లో వడగాలులు పౌరులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.