న్యూఢిల్లీ, మే 14: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ఆ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గురువారం తప్పుకొన్నారు. న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని కేజ్రీవాల్, నలుగురు పార్టీ నేతలు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టగా, వారిపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన క్రమంలో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్సైజ్ కేసును ఇంకో బెంచ్‌కు బదిలీ చేయాలని తాను చీఫ్ జస్టిస్‌ను కోరినట్టు తెలిపారు.
కేసు నుంచి తప్పుకోవడంపై వివరణ ఇస్తూ కేసులో పక్షపాతం గురించి ఎలాంటి సందేహాలు రాకుండా నిరోధించడానికే తాను ఎక్సైజ్ పాలసీ కేసు నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. న్యాయమూర్తి నిర్ణయంపై స్పందించిన కేజ్రీవాల్.. ‘సత్యం విజయం సాధించింది’ అని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో జస్టిస్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని సత్యాగ్రహ విజయంగా ఆయన అభివర్ణించారు.