కేసీఆర్ పాలనలో విద్యార్థులు మెచ్చేలా మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా అమలయ్యే మెనూ, నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యతో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు ఇప్పుడు రేవంత్ సర్కారు పాలనలో గాడి తప్పి అధ్వానంగా మారాయి. మెనూ మార్చి పెడుతున్న దొడ్డన్నం, గొడ్డు కారం, మాడిపోయిన కిచిడీ తినలేక విద్యార్థులు కడుపు మాడ్చుకోవాల్సి వస్తోంది. కొందరు ఆ తిండి తినలేక హాస్టల్ నుంచి టీసీ తీసుకొని వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఎక్కువ సంఖ్యలో గిరిజనులు విద్యార్థులుండే మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాల దుస్థితి ఇది. జిల్లాలో ఇప్పటికే ఫుడ్ పాయిజన్‌తో ఎందరో విద్యార్థులు ఆస్పత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి. తాజాగా శనివారం మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ గురుకుల సందర్శనలో ఈ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాప్రతినిధుల పట్టింపు, అధికారుల పర్యవేక్షణ లేక హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
– మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 2
విద్యార్థులకు ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా కిచిడీ పెడుతున్నారు. సరైన వంట మనుషులు లేక అది సగం వరకు మాడిపోతున్నది. గతంలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులంలో తప్పనిసరిగా మెనూ పాటించేవారు. ఉదయం పూట పెట్టే కిచిడీలో సాంబారు రసం, చట్నీని తయారుచేసే వారు. ఇటీవల మొత్తం మార్చి కిచిడీలో గొడ్డు కారం వేసి పెడుతున్నారు. విద్యార్థులు అది తినకలేక బయట పడేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది విద్యార్థులు హాస్టల్లో ఉండేందుకు ఇష్టపడడం లేదు.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
గతంలో గురుకులంలో తప్పనిసరిగా మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడంతో ప్రశాంత వాతావరణంలో చదివి బాగా రాణించేవారు. ఇప్పుడు గురుకులంలో పరిస్థితి అలా లేదని, ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ట్రైబల్ వెల్ఫేర్, గురుకుల ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తరచూ గురుకులాలను పర్యవేక్షించి, అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అపరిశుభ్రంగా పరిసరాలు
గురుకులంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. ఇక్కడ సుమారు 450మంది విద్యార్థులకు పైగా చదువుతున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్, తరగతి గదులు, హ్యాండ్‌వాష్, మంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల క్లీన్ చేసే వారు తక్కువ సంఖ్యలో ఉండడంతో వాష్ రూమ్‌ల ముందు పాకురు పట్టి అపరిశుభ్రంగా నెలకొన్నాయి. అధికారులు, వార్డెన్లకు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
పుడ్ పాయిజన్ ఘటనలెన్నో..
గురుకులాల్లో శుభ్రత పాటించకపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్ధులకు రాత్రిపూట వండిన భోజనం సరిగా ఉడకకపోవడం వల్ల కడుపునొప్పితో దవాఖాన పాలయ్యారు. మహాత్మాజ్యోతిరావు పూలే గురకులంలో సరైన వసతులు లేవని తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, టీచర్లతో మాట్లాడిన సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల విద్యార్థులు గురుకులంలో చదవడం ఇష్టం లేక టీసీలు తీసుకుని పోతున్న ఘటనలు ఉన్నాయి.