ముషీరాబాద్, జూలై 9: రాష్ట్రంలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రికి గురువారం లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీతం రూ. 28 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని కోరారు.
గత 15 ఏండ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచకపోవడం శోచనీయమని అన్నారు. కాలేజీలు ప్రారంభమై నెలరోజులవుతున్నా ఇంతవరకు గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయలేదని, దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 4,098 అధ్యాపక పోస్టులు ఉండగా ప్రస్తుతం 1,276 మంది రెగ్యులర్, 1,940 మంది గెస్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారని, ఇప్పటికైనా అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.