ఒక పాఠశాల తలుపు మూస్తే… ఒక జైలు తలుపు తెరుస్తున్నట్టే అని ప్రపంచ విద్యావేత్తలు ఉత్తగనే అనలేదు. అది నాగరిక సమాజాల అనుభవం నుంచి పుట్టిన నికార్సయిన సత్యం. కానీ, స్వరాష్ట్ర కలలు కన్న తెలంగాణ మట్టిపై ఇప్పుడు విద్యాలయాల విధ్వంసానికి అధికారిక ముహూర్తాలు సిద్ధమవుతున్నయి. నిన్న మొన్నటిదాకా పాలకుల వైఫల్యాలపై జరిగిన రాజకీయ ఆరోపణలు కావివి… స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటి వెంట బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్’ సదస్సు సాక్షిగా వెలువడిన పెను ప్రమాద సంకేతాలు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేల క్లస్టర్ క్యాంపస్‌లుగా కుదిస్తామనడం అంటే ఒకే దెబ్బకు 23 వేల బడులను నామరూపాల్లేకుండా తుడిచేస్తమని ప్రకటించడం పరిపాలనా సంస్కరణ కాదు, తెలంగాణ సామాజిక అస్తిత్వంపై జరుగుతున్న దాడి!
తెలంగాణ పల్లెల్లో ‘బడి‘ అంటే కేవలం నాలుగు గోడల కాంక్రీట్ భవనం కాదు. అది ఊరి ఊపిరి. అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక. అది పల్లె పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అక్షర క్షేత్రం. గుడి, చెరువు, బడి… ఈ మూడు ఉన్న చోటే ఊరు నిలబడుతది, ఊరి ప్రాణం వీటిమీదనే కొట్టుకుంటది. అలాంటి బడులనే వేల సంఖ్యలో మూసేయాలని అనుకోవడం దివాలాకోరుతనం తప్ప, ప్రగతిశీల ఆలోచన ఎంతమాత్రమూ కాదు. విద్య అనేది సెక్రటేరియట్ ఫైళ్లల్ల నలిగే ఒక కాగితం ముక్క కాదు. రాజ్యాంగం పేదవాడి చేతిలో పెట్టిన కలం… సమాజంపై పోరాడేందుకు ఇచ్చిన ఒకే ఒక్క ఆయుధం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ‘చదవండి, సంఘటితమవండి, పోరాడండి‘ అని పిలుపునిచ్చారు. నేడు ఆ పిలుపును, ఆ ఆయుధాన్ని తెలంగాణ పేద ప్రజల నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నయి.
తండాల్లో, గ్రామాల్లో ’సింగిల్ టీచర్’ స్కూళ్లు ఉన్నయని, పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో బడులను ఎత్తేయడం దుర్మార్గం. ఈ తుగ్లక్ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువు ఆపేసేవారు విపరీతంగా పెరుగుతరు. ఊరు దాటి మైళ్ల దూరం పోయి చదువుకోవాలంటే పేద తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడబిడ్డలను పంపడానికి జంకుతరు.
ఫలితంగా బాల్య వివాహాలు, బాల కార్మికత్వం మళ్లీ కోరలు చాస్తయి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి బిడ్డకూ తమ నివాస ప్రాంతానికి సమీపంలోనే ఉచిత ప్రాథమిక విద్య అందాలనే రాజ్యాంగ హక్కును ఈ నిర్ణయం పూర్తిగా కాలరాస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ చక్రధర్‌రావు వంటి ప్రముఖ విద్యావేత్తలతో కూడిన ’తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ’ హెచ్చరిస్తున్నట్టు 23,000 స్కూళ్లు మూసివేస్తే రాష్ట్రంలోని దాదాపు 9,000 గ్రామాల్లో అసలు ప్రభుత్వ పాఠశాల అనేదే లేకుండా పోతది. ఇది విద్యా సంస్కరణ కాదు, ముమ్మాటికీ విద్యా సంక్షోభం!
ఒక దిక్కు ప్రాథమిక విద్యను సమాధి చేసుకుంటూనే, ఇంకోదిక్కు గతంలో విజయవంతంగా నడిచిన తెలంగాణ సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న ఈ స్కూళ్ల అద్దెలను ప్రభుత్వం నెలల తరబడి చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేసే దుస్థితి వచ్చింది. నిరుపేద విద్యార్థులకు మెస్ చార్జీలు, నిత్యావసర వస్తువుల సరఫరా లేక ఆకలితో అలమటిస్తున్నరు.
ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలన్న ’తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్’ అనాలోచిత సిఫారసులతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్లు ఆలస్యమై లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డరు. తీవ్ర ప్రజావ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినా, రేవంత్‌రెడ్డి అనాలోచిత విధానాలకు ఇది నిదర్శనం.
ఫిన్లాండ్ వంటి చిన్న దేశాల్లో చిన్న గ్రామాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలను ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడుకుంటరు. ఎందుకంటే సమాన విద్యే అసమానతలు లేని సమాజానికి పునాది అని వాళ్లు నమ్ముతరు. కానీ మనకు దొరికిన పాలకుడు మాత్రం ముందు బడిని బలహీనపరిచి, బడులకు ఉపాధ్యాయులను ఇయ్యకుండా, మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు కల్పించకుండా… పైపెచ్చు ‘పిల్లలు లేరు‘ అనే సాకుతో బడి మూసేస్తా అనడం ఏ రకమైన సామాజిక న్యాయం? అధికారంలోకి వస్తే బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికిన కాంగ్రెస్ పెద్దల మాటలు ప్రజలకు ఇంకా గుర్తున్నయి. ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలలపై కత్తి ఎత్తడం ప్రజావిశ్వాసానికి జరుగుతున్న నమ్మక ద్రోహం. నయవంచన.
కార్పొరేట్ తరహాలో ‘భారీ క్యాంపస్‌లు, బస్సు సౌకర్యాలు‘ కల్పిస్తమని పైకి తియ్యటి మాటలు చెప్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలోని వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం ద్వారా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచిత విద్యను దూరం చేయబోతున్నదనేది నికార్సయిన వాస్తవం. తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డకూ తన ఊరిలోనే నాణ్యమైన ప్రభుత్వ బడి ఉండాలె. ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలను కొనసాగిస్తూ ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి. సంస్కరణల పేరిట విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన మౌళిక వసతులు, డిజిటల్ సదుపాయాలు కల్పించాలి. ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేసి, వారిని బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలపై కఠి న నియంత్రణను అమలు చేయాలి. బడిని కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటం. ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం. ప్రజల గొంతు వినని పాలన ఎక్కువ కాలం నిలువదు. పల్లె బడి బతికితేనే తెలంగాణ భవిష్యత్తు బతుకుతది. కవి జయరాజు అన్నట్టుగా కొండల్లో కోయిల పాటలు పాడాలే, పల్లెల్లో అక్షర దీపం వెలగాలె. పల్లె పోరడు తిక్కన వోలె నవభారతం రాయాలె. ఆడ పిల్ల ఒక మొల్ల వోలె రామాయణమే చెప్పాలె. ఇక పల్లెల్లో అక్షర దీపాన్ని ఆర్పివేసి, భవిష్యత్తు తరాల జీవితాలను చీకటిమయం చేయాలని చూసే పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతరు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ అట్లాంటా, యూఎస్ఏ ప్రతినిధి)
– కృష్ణ చైతన్య అల్లం