దేముడి గురించి ఆస్తికులు కండ్లు మూసుకొని చాలా భక్తిగా మాట్లాడుతారు. అది చూసి నాస్తికులు నవ్వడమే కాకుండా, హేళనగా కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. మీరు చెప్పే దేవుడు అంత శక్తిమంతుడైతే, మరి గుళ్లల్లోంచి కూడా కోట్లకు కోట్లు మాయమవుతుంటే ఆయన ఆపడెందుకు? అని చాలా తెలివిగా అడుగుతారు. ఇటువంటి మాటలు, చేతలు వేదకాలంలో చార్వాకులు కూడా అడిగారు. చూడండి, మేము వేదాలు కాలుస్తున్నాము. మీ దేవుడొస్తాడేమో, ఇద్దరం చూద్దాం అని హిరణ్యకశిపుడిలాగా సవాల్ చేస్తారు. అయితే వీరిద్దరూ- ఆస్తికులు, నాస్తికులు- దేముడి తత్వాన్ని, ఆయన పనితీరును అర్థం చేసుకోలేదన్నమాట!
నిజానికి దేవుడు ఇతర జంతుజాలాన్ని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించి, జంతువులకు ఇవ్వని రెండు నైపుణ్యాలను మనిషికి ఇచ్చాడు. ఒకటి విచక్షణ కలిగిన మేధ, రెండు తన ఆలోచనలు, భావాలు వ్యక్తీకరించగలిగిన భాషా నైపుణ్యం. మిగతా జంతువులన్నీ సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒకేలా ప్రవర్తిస్తున్నాయి. వాటికి నాగరికత అనే జాడ్యం లేదు. కానీ నాగరికులం అవుతున్నామని అనుకొనే మానవులే తరతరానికి మారుతున్నారు. అయితే తన మేధలోని విచక్షణను ఉపయోగించకుండా అశాశ్వతమైన వాటిని చూసి భ్రమపడుతున్నారు. మరి దేవుడు ఏమీ చెయ్యడా అంటే చేస్తాడు.
తమ గొప్పదనం, శక్తి మరచిపోయి, నీవే దిక్కు అని త్రికరణశుద్ధిగా ప్రార్థించిన వారిని ఆపదలోంచి బయటపడేస్తాడు. గజేంద్రమోక్షంలో, ద్రౌపది జీవితంలో జరిగిన అత్యంత నీచమైన అవమానానికి ఆయన అడ్డుపడిన తీరు నమ్మిన వాళ్లకు తమ జీవితంలో అనుభవమవుతుంది. నమ్మని వాళ్లు 27 అంతస్తుల భవనాలు కట్టుకొని, దాని నిండా డబ్బు నింపుకొంటారు.
వారికి ఇంకొంచెం సమయం పడుతుంది ఈ అవగాహన రావటానికి. అత్యద్భుత మేధావి స్టీవ్ జాబ్స్ 54 ఏండ్ల వయసులో క్యాన్సర్ బారినపడి, తన జీవిత చరమాంకంలో దవాఖానలో పడుకొని చెప్పిన మాటలు వింటే ఆ జీవిత సత్యం ఇప్పుడే బోధపడుతుంది. ఆ దశలో ఆయన ఆలోచనాత్మక భావాలు, ఇవీ: సంపద, బలగం, సాధించిన విజయాలు అన్నీ కూడా మనిషి రోగగ్రస్తుడైనప్పుడు పనికిరావు. ఎందుకంటే ఆ బాధను ఎంత గొప్పవారైనా ఎవరికీ పంచలేరు.
నిర్లక్ష్యంగా కార్లు నడిపి మనుషులను చంపి, ఆ నేరం తమ డ్రైవర్ల మీద పెట్టి, మానవులైన న్యాయాధీశుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. కానీ కేవలం సాక్ష్యాలు, తాము అనుకున్న న్యాయం మీద ఆధారపడే వీరి విచక్షణారహిత తీర్పులపైన ఉన్న ఇంకో న్యాయస్థానం, కేవలం ధర్మం ప్రాతిపదికగా ఉన్న న్యాయం ఇంకోటుంది. అది తప్పించుకోలేరు.
నిప్పు ముట్టుకుంటే అమాయకుడైన చిన్న బాలుడికైనా, పెద్ద వారికైనా కాలుస్తుంది. అది నిప్పు ధర్మం. మనకు కనపడే పంచభూతాలకు పైన కనపడని కర్మ అనే ప్రాతిపదిక మీద నడిచే ధర్మం ఇంకోటుంది. దేవుడు తన ఆస్తి కాపాడుకోవటానికి ఎందుకు దిగిరాడు అంటే, ఆయన మనిషిని ఒక్కడినే సర్వస్వతంత్రుడిగా సృష్టించాడు. ఆ మనిషి ఆలోచనలు, ఆచరణ బట్టి ఏర్పడే కర్మానుభవం ఉంటుంది. సృష్టికర్త దగ్గర విశ్వమంత పుస్తకం ఒకటుంటుంది. అందులో నమోదు అయ్యాకే మనుషులు పుడుతారు.
ఇక అతని బుద్ధి తెలిసిన దగ్గర నుంచి అతని మంచి పనులు ఎడమ పేజీలో, చెడ్డ పనులు కుడి పేజీలో లిఖిస్తారు. కాబట్టి ఒకసారి అతడి జన్మ జరిగాక వాడు దొంగగా మారి దేవుడి నగలు కాజేసినా, స్వార్థ రాజకీయ నాయకుడిగా ప్రజల సొమ్ము దోచుకున్నా, అక్రమాలు, అత్యాచారాలు చేసినా, దేవుడు కేవలం సాక్షిగా చూస్తుంటాడు. ఒక వయసు దాటాక పిల్లలు పెద్దల మాట వినక అక్రమాలు చేస్తే వారేమి చేస్తారు? చూస్తూ ఉండటమే కదా! అందరినీ సృష్టించిన ఆ దేవుడు కూడా అంతే!
ఇక మరి ఈ అక్రమాలు చేసే వారికి నిజంగా వారి కర్మలు శిక్ష విధిస్తాయా అని సందేహం వస్తుంది. కర్మ సిద్ధాంతం నమ్మనివారు తమకు తాము కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవాలి. తల్లిదండ్రులకు చక్కటి ఆరోగ్యం ఉన్నా, వారికి పుట్టిన పిల్లలకు చిన్నవయసులోనే క్యా న్సర్ వచ్చి మరణించడమేమిటి? కొందరు సంపన్నుల ఇండ్లలో జన్మిస్తే, మరికొందరు బీదవారికి పుట్టడమేమిటి? ఇంకొందరు అనాథలుగా బతకడమేమిటి? పన్నెండేండ్ల వయసులో కూడా కేవలం ఒకే ఒక్క డ్రెస్సు ఉన్న నెపోలియన్ తన దేశం కాని దేశం ఫ్రాన్స్‌కు ఏలిక కావటమేమిటి?
ముఖ్యమంత్రులుగా చేసిన కొందరు చివరి దశ లో తిండికి కూడా నోచుకోని దౌర్భాగ్యమేమిటి? కొందరు చిన్నతనంలో తమ పూర్వజన్మ గురించిన విషయాలు ఆధారాలతోపాటు నిరూపించడమేమిటి? ఇక ఈ కర్మను ప్రత్యక్షంగా అనుభవించిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
మహాయోధులుగా పేరొందిన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అత్యంత దయనీయమైన మరణం పొందటం ఒక నిరూపణ కాదా? జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన వారికి కూడా ఆ కర్మలో భాగముంటుంది కదా! అరిషడ్వర్గాలను జయించి, ధర్మమూర్తిగా బతికిన ధర్మరాజు, శరీరంతో స్వర్గానికి వెళ్లగలిగిన పుణ్యాత్ముడికి కూడా కొద్దిగా బాధ తప్పలేదు. ఆయన మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు సగం అబద్ధం ఆడటం. అశ్వత్థామ హతః అని పెద్దగా అని కుంజరః అని చిన్నగా పలికి అతని తండ్రి ద్రోణుడి అస్త్ర సన్యాసానికి కారణమయ్యాడు. ఆ నేరానికి ఆయనను స్వర్గం వెళ్లే ముందు నరకానికి తీసుకెళ్లి తన సోదరులు, ద్రౌపది పడుతున్న బాధలు చూసి బాధపడేటట్టు చేసింది, ఆ కర్మ ధర్మరాజును.
ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టి, మనుషులను విడగొట్టి, అధర్మమార్గాలలో ఓట్లు కొల్లగొట్టిన పార్టీలకు చెందినవారు, ఇక దేవుడి సొమ్మును కూడా దొంగతనం చేశారంటే వారికి ఆ శ్రీరాముడి మీద ఉన్నది నిజమైన భక్తా? తమ మతం మీద ఉన్నది నిజమైన నమ్మకమా? దేముడికి ఆ ధనం ఎక్కడున్నా తేడాలేదు. ఎందుకంటే ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి. కేవలం వీరి లీలలు, విన్యాసాలు, దురాశను గమనిస్తున్నాడు, అంతే! ఇప్పుడు నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరు ఉద్యోగులకు ఇక్కడి మానవులైన న్యాయమూర్తులు శిక్షలు వేయవచ్చు. ఆధారాలు లేవని విడిచిపెట్టవచ్చు. కానీ ఇంత పెద్ద అక్రమం జరిపించిన పెద్ద తలకాయలు మాత్రం కర్మను, దాని శిక్షను తప్పించుకోలేరు. జై శ్రీరామ్.
– దంటు కనకదుర్గ