న్యూఢిల్లీ, మార్చి 1: జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో రూ.1.84 లక్షల కోట్ల స్థూల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కిందటేడాది ఇదే నెలలో వసూలైన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 9.1 శాతం చొప్పున పెరిగాయని తెలిపింది. దేశీయ వినిమయం పుంజుకోవడం, ఆర్థిక రంగం తిరిగి వృద్ధి బాట పట్టడం వల్లనే జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతునాయని వెల్లడించింది. గత నెలలో వసూలైన రూ.1.84 లక్షల కోట్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.35,204 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,704 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.90,870 కోట్లు, పరిహారం సెస్ రూపంలో రూ.13,868 కోట్లు వచ్చాయని పేర్కొంది. జీఎస్టీ వసూళ్లలో దేశీయంగా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10.2 శాతం ఎగబాకి రూ.1.42 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను ద్వారా రూ.41,702 కోట్లు సమకూరాయి.
అలాగే రూ.20,889 కోట్ల పన్నును రిఫండ్ రూపంలో చెల్లించింది. ప్రస్తుత సంవత్సరం తొలి నెల జనవరిలో రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి. దీనిపై ఈవై ట్యాక్స్ పార్టనర్ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ..దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందడానికి ఈ జీఎస్టీ వసూళ్లే నిదర్శణమని, అంతర్జాతీయ దేశాలు అనిశ్చిత పరిస్థితిలో ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు ఇంచుమించు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషమన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లు 10 శాతం నుంచి 20 శాతం వరకు అధికమవగా, అలాగే తెలంగాణతోపాటు గుజరాత్, అసోం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో 1 శాతం నుంచి 4 శాతం వరకు పెరిగాయి.