న్యూఢిల్లీ, జూన్ 1: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. మే నెలకుగాను రూ.1.73 లక్షల కోట్ల మేర వసూలయ్యాయని ఆర్థిక మంత్రి త్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 10 శాతం పెరిగినప్పటికీ, ఏప్రిల్లో రూ.2.10 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గాయి. వీటిలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.32,409 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.40,265 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.87,781 కోట్లు, సెస్ రూపంలో మరో రూ.12,284 కోట్లు సమకూరాయి. గత రెండు నెలల్లో రూ.3.83 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి.
తెలంగాణలో 4,986 కోట్లు
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.4,986 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.4,507 కోట్లతో పోలిస్తే 11 శాతం అధికమని పేర్కొంది. అలాగే పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ 15 శాతం చొప్పున పెరిగాయి. 2023 ఏడాది మే నెలలో రూ.3,374 కోట్ల జీఎస్టీ వసూలవగా, ఈసారి రూ.3,890 కోట్లకు చేరుకున్నాయి.