న్యూఢిల్లీ, అక్టోబర్ 30:కీలక రంగాల్లో నిస్తేజం కొనసాగుతున్నది. గత నెలకుగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 9.5 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆగస్టులో మైనస్ 1.6 శాతం నమోదైన వృద్ధి ఆ మరుసటి నెలలో పుంజుకోవడం విశేషం. క్రూడాయిల్, సహజ వాయువు, విద్యుత్ రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం వల్లనే కీలక రంగాల్లో నిస్తేజం నెలకొన్నదని తెలిపింది. అలాగే బొగ్గు, ఎరువులు, స్టీల్ రంగాలు తిరిగి కోలుకోవడం వల్లనే ఈ మాత్రమైన వృద్ధిని సాధించాయి. సిమెంట్ రంగం 7.1 శాతం, రిఫైనరీ 5.8 శాతం వృద్ధిని సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి 4.2 శాతంగా ఉన్నది. మొత్తం పారిశ్రామిక వృద్ధిరేటులో 40 శాతం వాటా కలిగిన కీలక రంగాలు నిస్తేజం నెలకొనడంతో దేశీయ తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా వర్షాలు కురియడంతో గనులు, విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం ఏర్పడటంతో మొత్తం కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఇక్రా చీఫ్ ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. మరోవైపు, సిమెంట్ ఉత్పత్తి ఆరు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.