కామారెడ్డి, మార్చి 29 : రోజురోజుకూ భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్నో ఆశలతో వేసిన పంటలకు సరిగా నీరందక రైతు కండ్ల ముందే ఎండిపోతున్నాయి. సరిపడా కరెంటు ఉన్నా.. బోరు బావుల్లో నీరు లేక రైతులు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది. తమ గ్రామానికి చెరువులు, కుంటలు లేవని.. బోరు బావులపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్నామని కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి తండా వాసులు తెలిపారు.
ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడంతో బోరు బావుల్లో నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటల కరెంటు ఉండేదని, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు ఉండడంతో భూగర్భ జలాలకు ఢోకా ఉండేది కాదన్నారు. జిల్లా కేంద్రంలో అధికారులు కేవలం మొక్కుబడిగా సాగునీటి సమస్యపై సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప, క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పు తెచ్చి పంట సాగుచేశా..
ఉన్న బోరుపై ఆధారపడి నాకున్న రెండెకరాల్లో వరి పంట వేశా. పెట్టుబడి కోసం సుమారు రూ.60వేల వరకు ఖర్చు చేశా. ప్రస్తుతం బోరులో నుంచి చుక్క నీరు రావడం లేదు. ప్రస్తుతం పంట ఎండుతున్నది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. పెట్టుబడితోపాటు పంట నష్టపోవడంతో రూ.రెండు లక్షల వరకు అప్పు అయ్యే పరిస్థితి నెలకొన్నది. మా తండాలో రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నది. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలి.