Green Tea Side Effects | గ్రీన్ టీ ని సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాను గ్రీన్ టీని రోజూ తాగుతున్నారు. గ్రీన్ టీని రోజూ తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గ్రీన్ టీని తాగితే మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. నీరసం, అలసట తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ టీ వల్ల మనకు కలుగుతాయి. అయితే గ్రీన్ టీ ఆరోగ్యకరమే అయినప్పటికీ దీన్ని మోతాదులోనే తాగాలని, అతిగా తాగితే పలు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గ్రీన్ టీని అధికంగా సేవిస్తే అందులో ఉండే సమ్మేళనాల కారణంగా మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోలేదు. దీని కారణంగా ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా రక్తహీనత వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక గ్రీన్ టీని అతిగా తాగకూడదు. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే అసలు తాగకూడదు. కనీసం 2 గంటల విరామం ఇచ్చి ఆ తరువాతే గ్రీన్ టీని సేవించాల్సి ఉంటుంది. దీంతో ఐరన్ శోషణకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే ఈ టీని అతిగా తాగితే గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీని వల్ల గుండెకు ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ టీని మోతాదుకు మించి తాగకూడదు.
గ్రీన్ టీలో కెఫీన్ ఎక్కువగానే ఉంటుంది. కాఫీ, టీ లకన్నా కెఫీన్ ఇందులో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ గ్రీన్ టీని అతిగా సేవిస్తే శరీరంలో కెఫీన్ అధికంగా చేరే ప్రమాదం ఉంటుంది. ఇది శరీరంలో అధికంగా చేరితే శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, కడుపులో మంట, ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బీపీ పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక గ్రీన్ టీని మోతాదులో తాగితే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. కానీ మోతాదుకు మించి తాగితే తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. కనుక తలనొప్పి ఉన్నవారు గ్రీన్ టీని సేవిస్తుంటే ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
ఇక గ్రీన్ టీని మోతాదుకు మించి తాగితే వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఆహారం తినలేకపోతారు. ఆకలి అసలు ఉండదు. అలాగే కళ్లపై కూడా ఒత్తిడి పడుతుంది. గ్రీన్ టీని అధికంగా తాగితే కొందరికి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల ముఖం, నాలుక, గొంతు, పెదవులు వంటి భాగాల్లో దురదగా ఉంటుంది. కొందరికి చర్మంపై దురదతోపాటు దద్దుర్లు కూడా వస్తాయి. కనుక గ్రీన్ టీని రోజూ మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. రోజుకు 2 కప్పుల వరకు ఈ టీని సేవించవచ్చు. అంతకు మించి తాగకూడదు.