Sleep Positions | నిద్ర అనేది మనకు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఎవరైనా రోజూ తగినంత సమయం పాటు కచ్చితంగా నిద్ర పోవాల్సిందే. దీంతో శరీరం మరమ్మత్తులు చేసుకుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మరుసటి రోజు పనిచేసేందుకు కావల్సిన శక్తి మనకు వస్తుంది. దీంతో రోజంతా యాక్టివ్గా ఉంటాం. అయితే నిద్ర విషయానికి వస్తే పడుకున్నాక ఎవరైనా తమకు సౌకర్యవంతంగా ఉన్న భంగిమలో శరీరాన్ని ఉంచి నిద్రపోతారు. కానీ ఒక్కో భంగిమలో నిద్ర పోవడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. అలాగే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఎలాంటి భంగిమలో నిద్రిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి.. అన్న వివరాలను వైద్యులు తెలియజేస్తున్నారు. వాటిని తెలుసుకుంటే నిద్రించేటప్పుడు ఏ భంగిమను ఉపయోగించాలి అన్న విషయంపై స్పష్టత వస్తుంది. దీంతో శరీరంపై ఒత్తిడి పడకుండా నిద్రించవచ్చు.
సోల్జర్ పొజిషన్.. ఎవరికైనా నిద్రించడానికి ఇదే కరెక్ట్ భంగిమ అని చెబుతారు. దీన్ని యోగాలో శవాసనం అంటారు. దీని వల్ల మన వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. మెడ, చేతులకు బలం కలుగుతుంది. శరీర భంగిమను మెరుగు పరుస్తుంది. అసిడిటీ తగ్గుతుంది. ఛాతి కరెక్ట్ సైజ్లో ఉంటుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. తలనొప్పి ఉండదు. ముఖంపై ముడతలు రావు. అయితే ఈ భంగిమలో నిద్ర పోవడం వల్ల గురక ఎక్కువగా వస్తుంది. గర్భంతో ఉన్న స్త్రీలకైతే కడుపులోని పిండంపై ప్రభావం చూపుతుంది. వెన్నెముక కింది భాగంలో కొంత మందికి నొప్పి రావచ్చు. అయితే ఈ సమస్యలను నివారించాలంటే తల కింద దిండు లేకుండా నిద్రించాలి. అలాగే స్టార్ ఫిష్ పొజిషన్ అనే భంగిమలో నిద్రించడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, గ్యాస్, అసిడిటీ, ముఖంపై ముడతలు వంటి సమస్యలు ఉండవు. కానీ ఈ భంగిమ కూడా గురకను కలిగిస్తుంది. భుజాలు, వెన్నునొప్పి వస్తుంది. కనుక ఈ భంగిమలోనూ తల కింద దిండు లేకుండా నిద్రిస్తే మంచిది.
లాగ్ పొజిషన్ అనే భంగిమలో నిద్రించడం వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి రావు. గురక సమస్య ఉండదు. గర్భిణీలకు ఇలా నిద్రించడం మంచిది. కానీ ఇలా నిద్రిస్తే తొడల నొప్పి, చర్మంపై ముడతలు రావడం, వక్షోజాలు సాగి పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే మెడ కింద పెద్ద తలదిండు పెట్టుకోవాలి. అలాగే నిద్రించేటప్పుడు తొడల మధ్య మరో దిండును పెట్టుకుని నిద్రించాల్సి ఉంటుంది. ఈర్నర్ పొజిషన్ అనే భంగిమలో నిద్రించడం వల్ల మెడ, వెన్ను నొప్పి, గ్యాస్, అసిడిటీ, గురక, కడుపులో మంట వంటి సమస్యలు ఉండవు. కానీ ఈ భంగిమ వల్ల భుజాలు, చేతుల నొప్పి, లివర్, జీర్ణాశయంపై ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. వక్షోజాలు సాగిపోవడం, ముఖంపై త్వరగా ముడతలు రావడం జరుగుతుంది. వీటిని నివారించాలంటే ఇలా నిద్రించే వారు తల కింద సాటిన్ పిలో కేస్ పెట్టుకుని, తొడల మధ్య దిండు ఉంచుకుని నిద్రించాలి.
ఫీటల్ పొజిషన్ భంగిమలో నిద్రించడం వల్ల గురక తగ్గుతుంది. గర్భిణీలకు మంచి చేస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు. కానీ ఈ భంగిమ వల్ల మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుందది. అలాగే చర్మంపై త్వరగా ముడతలు వస్తాయి. వక్షోజాలు సాగిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ భంగిమలో నిద్రించేటప్పుడు తల కింద కచ్చితంగా దిండు ఉండాలి. రాత్రి పూట అటు, ఇటు పక్కలకు తిరుగుతూ మారుతూ నిద్రించాలి. ఫ్రీఫాల్ పొజిషన్ అనే భంగిమలో నిద్రించడం వల్ల గురక సమస్య ఉండదు. కానీ దీని వల్ల వెన్నెముక, మెడ నొప్పి, రక్త సరఫరాలో ఆటంకాలు, ముఖంపై ముడతలు ఏర్పడడం, అంతర్గత అవయవాలపై ఒత్తిడి పడడం వంటి సమస్యలు వస్తాయి. కనుక ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే పొట్టకు, పరుపుకు మధ్య దిండు పెట్టుకుని నిద్రించాల్సి ఉంటుంది. ఇలా ఆయా భంగిమల్లో నిద్రించడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కనుక ఎవరికి సౌకర్యవంతమైన భంగిమలో వారు శరీరంపై భారం పడకుండా నిద్రించాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.