Hair Fall Reasons | ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నా పెద్ద, ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్య వస్తోంది. పురుషుల్లో అయితే జుట్టు రాలడం మరీ తీవ్రతరం అయి బట్టతల కూడా వస్తోంది. అయితే జుట్టు రాలేందుకు అనేక కారాణాలు ఉంటాయి. సరైన కారణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలేందుకు అసలు కారణం ఏమిటో ముందుగా గుర్తిస్తే ఆ సమస్య తగ్గేందుకు అంత ఎక్కువగా అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇలా కారణాన్ని వెతికి పలు చిట్కాలను పాటిస్తే అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.
జుట్టు రాలేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి మరీ చల్లని లేదా మరీ వేడిగా ఉంటే నీటిని వాడడం. దీని వల్ల జుట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. జుట్టు బలహీనంగా మారి త్వరగా రాలిపోతుంది. కనుక స్నానం చేసేందుకు ఎల్లప్పుడూ గోరు వెచ్చని నీటిని వాడడం మంచిది. అలాగే హెల్మెట్స్ ను ఎక్కువ సేపు పెట్టుకొని ప్రయాణం చేయడం వల్ల తలలో చెమట ఎక్కువగా పట్టి కురుల మూలాలు బలహీన పడేలా చేస్తుంది. అందు వల్లనే అతి చిన్న వయస్సులో ఉన్నవారిలో కూడా జుట్టు రాలడం కనిపిస్తుంటుంది. ఇక తల దువ్వేటప్పుడు ముందుగా పెద్ద పళ్లు ఉన్న దువ్వెనలతో చిక్కుముడులు వదిలించి, ఆ తర్వాతే వేరే దువ్వెనతో మృదువుగా దువ్వుకోవాలి. లేదంటే చిక్కుముడులతో లాగడం వల్ల వెంట్రుకలు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే తలస్నానం చేసినప్పుడు కురులను బాగా తడి ఆరనిచ్చి తలదువ్వాలి. చాలామంది తల తడిగా ఉన్పప్పుడే తలదువ్వుతుంటారు. . అయితే అలా చేయడం మంచి పద్దతి కాదు. దాని వల్ల ఎక్కువగా జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది.
జుట్టు చెదిరిపోకుండా హెయిర్ బ్యాండ్లు రక్షిస్తాయి కానీ కురులను గట్టిగా బ్యాండ్లు, క్లిప్పులతో బంధించడం వల్ల మద్యలో తెగిపోయే ప్రమాదం ఉంటుంది. జుట్టు మరీ పలుచగా ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి హెయిర్ బ్యాండ్లు, హెయిర్ క్లిప్పులను ఎక్కువ వాడకపోవడమే మంచిది. ఇక నీటి కాఠిన్యత వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కనుక మీరు వాడే నీరు సాఫ్ట్‌గా ఉందో లేదో చెక్ చేయడం మంచిది. అలాగే పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కొందరిలో థైరాయిడ్ సమస్య మరీ తీవ్రంగా ఉంటే జుట్టు రాలిపోతుంది. ఇక చాలా మందికి ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉంటాయి. కనుక జుట్టు సులభంగా రాలిపోతుంది. ఇలా జుట్టు రాలిపోయేందుకు పలు కారణాలు ఉంటాయని చెప్పవచ్చు.
అయితే జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారు పలు చిట్కాలను పాటిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది. నారింజ పండ్ల రసం, నీరు, ఒక టేబుల్ స్పూన్ తేనె, కొన్ని చందనపు నూనె చుక్కలను కలిపి మిశ్రమంగా చేసి దీన్ని మీ జుట్టుకు రాయండి. కాసేపు అయ్యాక తలస్నానం చేయండి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అదే విధంగా కోడిగుడ్డును బాగా బీట్ చేసిన తరువాత టేబుల్‌స్పూన్ పాలతో బాగా కలిపి జుట్టుకు పట్టించండి. తరువాత కాసేపు ఆగి స్నానం చేయండి. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు ఈ చిట్కా కూడా బాగానే పనిచేస్తుంది. అలాగే బాగా మగ్గిన అరటికాయను నలిపి గుజ్జుగా చేసి అందులో కొన్ని చుక్కల ఆల్మండ్ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తూ మసాజ్ చేసుకోండి. ఇలా చేస్తున్నా కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే నిమ్మకాయ గింజలను నల్లటి మిరియాలను తీసుకుని తగినంత నీరు కలిపి బాగా మెత్తగా దంచాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి కాసేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా కనీసం వారం పాటు రెగ్యులర్‌గా తలకి పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. ఇలా ఆయా చిట్కాలను పాటిస్తుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.