జనగామ రూరల్ : జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ్గర పడుతున్నా ఇంకా చాలా కొనుగోలు కేంద్రాల్లో 25 శాతం కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం, అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వడ్లను దిగుమతి చేసుకోకుండా తాలు పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ తీవ్రజాప్యం చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో 60 శాతం కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉండగా ఎక్కడా ఆ పరిస్థితి లేదు. కొనుగోలు సెంటర్ల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవాల్సిన మిల్లర్లు ఆన్లోడ్ చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారు. తాలు, మట్టి పెల్లల పేరుతో బస్తాకు రెండు కిలోల చొప్పున కట్ చేస్తున్నారు. మిల్లర్లు చేతులెత్తేయడం, అధికారులు స్పందించక పోవడం, లారీ కాంట్రాక్టర్లు సైతం ముందుకు రాకపోవడం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం అన్నదాతకు తల నొప్పిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగే లా చూడాలని రైతులు వేడుకుంటున్నారు.