నల్లగొండ రూరల్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని రైతు సంఘం నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. రైతు సంఘం నల్లగొండ మండల మహాసభ నల్లగొండలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారులు త్వరితగతిన బస్తాలను, లారీలను ఏర్పాటు చేసి వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. నేటికీ మండలంలోని అనేక వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు మాచర్ వచ్చినా సరే తాలుపట్టాలని రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. గత సీజన్ సన్న వడ్లకు నేటికీ బోనస్ రైతుల అకౌంట్లో వేయలేదన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ కనీసం రైతుల దుస్థితి పట్టించుకున్న నాథుడు లేడని విమర్శించారు. కొనబోతే కొరవి అమ్మబోతే అడవి అన్న చందం లాగా రైతుల పరిస్థితి తయారైందన్నారు.
సమయానికి సరిపడా యూరియా అందించలేని రాష్ట్ర ప్రభుత్వం కనీసం వచ్చే సీజన్ కైనా ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. రైతులకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలను వెంటనే అందజేయాలని, ఇచ్చిన పరికరాలకు రిపేర్లు వస్తే ఆ కంపెనీ టెక్నీషియన్స్ వెంటనే స్పందించి రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14వ తేదీన ఏచూరి గార్డెన్లో రైతు సంఘం జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున జరగనున్నట్లు తెలిపారు. రైతుల సమస్యలపై ఈ మహాసభల్లో చర్చించి ప్రణాళికని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ మహాసభని రైతులు విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. మహాసభ అనంతరం నూతన కమిటీని 15 మందితో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా ఏపూరి జానయ్య, ప్రధాన కార్యదర్శిగా దొండ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా బిట్ల వెంకట్ రెడ్డి, కుడ్తాల భూపాల్, సహాయ కార్యదర్శిగా శ్రీనివాస్ కుందారపు, సైదులు, సభ్యులుగా విజయ రెడ్డి, నాగేశ్వర్, ఆవుల యాదయ్య, సత్తయ్య, బత్తుల బక్కయ్య, సైదాచారి ఎన్నికయ్యారు.