నిర్మల్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస్తూ దగా చేస్తున్నది. సాధారణంగా యాసంగిలో సాగునీటి వనరుల లోటు కారణంగా తొందరగా చేతికొచ్చే దొడ్డురకం పంటను ఎక్కువగా సాగు చేస్తారు. సన్నాల సాగుకు పంట కాల పరిమితితోపాటు చీడపీడల బెడద ఎక్కువే. అయినప్పటికీ చాలా మంది రైతులు బోనస్ వస్తుందన్న ఆశతో సన్నాలను సాగు చేశారు. అయితే వారి ఆశ నిరాశే అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని విక్రయించి నెల రోజులు కావస్తున్నా నేటికీ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడలేదు. వానకాలం ప్రారంభమైనా బోనస్ డబ్బులు అందకపోవడంతో రైతులకు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు.
బోనస్ ఎగవేసేందుకు కుట్ర
నిర్మల్ జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో దొడ్డురకం 1.55 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సన్నరకం ధాన్యం 21,707 మెట్రిక్ టన్నులుగా ఉన్నది. సన్నరకం ధాన్యాన్ని విక్రయించిన 4024 మంది రైతులకు రూ.10.85 కోట్ల బోనస్ డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి. గత యాసంగికి సంబంధించి 4,600 మంది రైతులు, తాము పండించిన 25,717 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు.
ఇందుకు సంబంధించి రూ.12.86 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటి వరకు రైతులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేసింది. మొత్తం రెండు సీజన్లకు సంబంధించి రూ.23.71 కోట్ల బకాయిలు చెల్లించాలి. బోనస్ చెల్లింపు విషయంలో ప్రకటన చేయలేదు. ఇందుకు సంబంధించి డబ్బులు కూడా విడుదల చేయకపోవడంతో ఈసారి కూడా బోనస్ అందే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో రెండు సీజన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు వేయకుండా రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు బోనస్ డబ్బులు కూడా ఎగవేసేందుకు కుట్రలు చేస్తున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
కొంత ధాన్యం డబ్బులు చెల్లించని సర్కారు
ఈ యాసంగిలో మొత్తం 37,708 మంది రైతుల నుంచి రూ.418.90 కోట్ల విలువ చేసే దొడ్డు, సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు రూ.405.31 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో 13.59 కోట్లను జమ చేయాలి. బోనస్ డబ్బులు, ఈ యేడాది ధాన్యం అమ్మిన డబ్బులు రాకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే వానకాలం ప్రారంభమై కొన్ని చోట్ల విత్తనాలు వేసుకుంటున్నారు.
అలాగే బోరు బావుల కింద వరినారు పోసేందుకు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. వానకాలం పంటల సాగుకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే ఈ సమయంలో రైతులకు బోనస్ డబ్బులు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. గత వానకాలంలో పండించిన సన్నాలకు బోనస్ అందడంతో ఈసారి కూడా బోనస్ డబ్బులు వస్తాయని రైతులు గంపెడాశతో మండు వేసవిలో సైతం సన్న వడ్లను సాగు చేశారు. సాగు నీటి ఇబ్బందులను అదిగమంచి కేవలం బోనస్ వస్తుందన్న ఆశతో ధైర్యం చేసి సన్నాలను సాగు చేసిన రైతులకు ప్రస్తుతం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని రైతులు కోరుతున్నారు.