హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ) : విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది. ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థుల ఉద్యమం, మేధావులు, సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రైవేట్ వ్యక్తులకిచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నది. మంగళవారం వర్సిటీ అధికారులతో స చివాలయంలో సమీక్షించిన సర్కార్.. నాంప ల్లి ప్రాంగణాన్ని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్‌కు ఇ వ్వబోమని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలు తీసుకోబోమని వెల్లడించింది. విద్యార్థులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నది. అనంతరం వీసీ ఆచా ర్య నిత్యానందరావు నాంపల్లి ప్రాంగణంలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి ప్రభుత్వ నిర్ణయా న్ని ప్రకటించారు. దీంతో వర్సిటీ పరిరక్షణ సమితి సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.
తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టనున్నారన్న వార్తలు కలకలం సృష్టించిన విషయం తెలిసిం దే. ఈ ప్రాంగణంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆద్యకళా మ్యూజియానికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలపై విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. క్యాంపస్‌లో ఆందోళనలు చేశాయి. అన్నివర్గాలు కలిసి పోరుబాట పట్టారు. ఏబీవీపీ సహా పలు విద్యార్థి సంఘాలు కలిసి 15 రోజులపాటు నాంపల్లి, బాచుపల్లి క్యాంపస్‌లలో ఉద్యమించారు. బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యమానికి మద్దతు పలికారు.
తాజా పరిణామాలపై వర్సిటీ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు సర్కార్‌కు వేర్వేరు నివేదికలు సమర్పించాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సెక్రటేరియట్లో ఉన్నతస్థాయి సమావేశమై ఆ స్థలాన్ని ప్రైవేట్‌కు అప్పగింత వల్ల ఏర్పడే ప్రతికూలతలను ప్రభుత్వానికి నివేదించారు. సోమవారం ఇంటెలిజెన్స్ విభాగం నాంపల్లి ప్రాంగణాన్ని సందర్శించి స మగ్ర నివేదిక సర్కార్‌కు అందించింది. ఆద్యకళా మ్యూజియానికి కేటాయింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని మంగళవారం విద్యాశాఖకు నివేదికను సమర్పించింది. నాంపల్లిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను ఆది ధ్వని ఫౌండేషన్‌కు అప్పగించే విషయంపై పర్యాటక, సాంస్కృతికశాఖ స్పె షల్ సీఎస్ వాణీప్రసాద్ ఓ లేఖ రాయగా, ఈ లేఖపై యూనివర్సిటీ నివేదికను అందజేసింది. ఎట్టిపరిస్థితుల్లో నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కుదరదని నివేదికలో పేర్కొన్నది. విద్యార్థులు, కళాకారులు, అధ్యాపకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు సర్కార్‌కు సూచించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సర్కార్, నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్‌కు ఇవ్వడం లేదని స్పష్టతనిచ్చింది.
తెలుగు యూనివర్సిటీ, జూలై 14 : తెలుగు యూనివర్సిటీ నాంపల్లి ప్రాంగణంలో 15 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు వర్సిటీలో చోటులేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ ఆలిండియా యూనివర్సిటీస్ స్టేట్ కో-కన్వీనర్ కమల్ సురేశ్ మాట్లాడుతూ.. నాంపల్లి ప్రాంగణంలో తిరుమలరావుకు సంబంధించిన వస్తువులను వెంటనే ఖాళీ చేయించాలని వీసీని కోరారు. విశ్వవిద్యాలయాలు పరిశోధనా కేంద్రాలుగా కొనసాగాలే తప్ప, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల కార్యక్రమాలకు వినియోగించరాదని స్పష్టంచేశారు.