హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షలను పకనపెట్టి, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని, పాలమూరు బిడ్డగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ-1 నార్లాపూర్‌లో వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ఆయన మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేస్తూనే, ఈ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులను రాజకీయ కక్షతో ఇన్నాళ్లు పడావు పెట్టారని ఆరోపించారు. 2024, 2025లో పుషలంగా వర్షాలు కురిసినా, ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్ల నీటిని నిల్వ చేసుకొనే అవకాశం కోల్పోయామని విచారం వ్యక్తంచేశారు. ఒకవేళ అప్పుడే పంపులను నడిపి నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపి ఉంటే, ప్రస్తుత కరువు కాలంలో ఎల్లూరుకు నీటిని మళ్లించి, కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలోని రైతుల పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరారు. కృష్ణా నదికి వరద రాగానే కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల రిజర్వాయర్లను నింపేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని సూచించారు. రాజకీయాలను పకనపెట్టి, పాలమూరు ప్రాంత ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.