మా భూమి మాగ్గావాలె!
‘మా భూమి మాకే దక్కాలి.. ప్రైవేట్ కబ్జా కోరల నుంచి విముక్తి కలుగాలి’ ఇదే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి పోరు సలుపుతున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు.
- భూమి కోసం అలుపెరుగని పోరాటం
- గోపన్‌పల్లి భూపోరాటానికి నేటికి ఏడాది!
- బీఎన్జీవో సభ్యుల శాంతియుత దీక్షలు
- 365 రోజులుగా అలుపెరుగని పోరు
- దీక్షలు జరుగుతుండగానే12 మంది మృతి
- సర్కార్.. భూమి ఇప్పించాలని డిమాండ్
- వేలాది మందితో నేడు గోపన్‌పల్లిలో సభ
- హాజరుకానున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 14 (నమస్తే తెలంగాణ): ‘మా భూమి మాకే దక్కాలి.. ప్రైవేట్ కబ్జా కోరల నుంచి విముక్తి కలుగాలి’ ఇదే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి పోరు సలుపుతున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు. ఒకటి, రెండు జిల్లాల వారే కాదు.. 33 జిల్లాల ఉద్యోగులు మొక్కవోని దీక్షతో నిరసన పోరులో భాగస్వాములయ్యారు. 2025, జూలై 16న భాగ్యనగర్ ఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యులు మొదలుపెట్టిన శాంతియుత దీక్షలకు బుధవారం నాటికి ఏడాదవుతుంది. ఆనాటి నుంచి అప్రతిహాసంగా, అలుపెరుగకుండా దీక్షలు కొనసాగుతున్నాయి. ఏడాది సందర్భంగా వేలాది మందితో గోపన్‌పల్లిలో భారీ సభ నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని 36, 37 సర్వేనంబర్లలో 189.11 ఎకరాల భూమిని 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లస్థలాల కోసం కేటాయించింది. ఆ భూముల్లో ఉద్యోగులు సొంతంటి కల నెరవేర్చుకోవాలని అనుకొన్నారు. కానీ ఆ భూములతో వ్యాపారం చేయాలనుకోలేదు.
న్యాయపర చిక్కులు
తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం న్యాయపరమైన అడ్డంకులతో ఉద్యోగులకు ఆ స్థలాలు దక్కకపోయినా, ఆ భూములు తమవేనని ఉద్యోగులు భావిస్తూ వచ్చారు. కాలక్రమేణా హైదరాబాద్ విస్తరణతో ఈ గోపన్‌పల్లి భూములకు గిరాకీ పెరిగింది. ఫలితంగా ఆ ఉద్యోగులను ఆందోళనకు గురిచేసేలా ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. జేసీబీలు, పొక్లెయినర్లతో ఫ్లడ్‌లైట్లు వెలుతురులో వెంచర్ చేశారు. కండ్ల ముందు తమవిగా భావించిన భూములు కబ్జా అవుతుండటంతో ఆ ఉద్యోగులు తల్లడిల్లారు. తోటి ప్రభుత్వ ఉద్యోగులైన రెవెన్యూ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. చివరకు న్యాయస్థానం తలుపుతట్టి ఉపశమనం పొందారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్-కోతో కబ్జా కాండ ఆగిందేగానీ తమ భూములు తమకు ఎప్పుడు దక్కుతాయోనన్న ఆందోళన మాత్రం వారిని వెంటాడుతూనే ఉన్నది.
సర్కార్ పెద్దల కన్ను
గోపన్‌పల్లిలోని 36, 37 సర్వేనంబర్లలోని ఈ ప్రభుత్వ భూమిపై నిరుడే సర్కార్ పెద్దలు కన్నేయడం, ఉద్యోగులకు దక్కాల్సిన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు విశ్వప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. 90 ఎకరాలను కాజేసేందుకు మొదలైన ఈ భారీ కుట్రలో భాగంగా కలెక్టర్ నుంచి 91 ఎకరాలకు ఎన్వోసీలు జారీకావడం, అనంతరం జరిగిన నాటకీయ పరిణామాలతో అందులో 17.04 ఎకరాల ఉత్తర్వులు మాత్రమే అమల్లో వచ్చాయి. అయినా రాత్రికి రాత్రి ప్రైవేట్ వ్యక్తులు కొందరు దాదాపు 30-40 ఎకరాలను ఆక్రమించి వెంచర్ రూపొందించడంతో ఉద్యోగులు నిరసనగా శాంతియుత దీక్షలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొందరు ఆ భూములపై కన్నేయడం.. ‘నమస్తే తెలంగాణ’ ఆ కుట్రలను వెలుగులోకి తీసుకురావడంతో భాగ్యనగర్ టీఎన్జీవోలు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది కాలంలో జరిగిన పోరాటంలో పలువురు ఉద్యోగులు మరణించారు.
ఆ భూములు భాగ్యనగర్ ఎన్జీవోలకే చెందాలె..
2010లో జీహెచ్ఎంసీ అనుమతితో లేఅవుట్ చేసిన ఆ భూములు భాగ్యనగర్ ఎన్జీవోలకు చెందినవే. అయినా1984లో ప్రైవేట్ వ్యక్తులు లేఅవుట్ చేసిన భూములుగా చిత్రీకరించే ప్రయత్నం ఇప్పటికైనా మానుకోవాలి. మా దీక్షలు బుధవారంతో ఏడాది పూర్తి చేసుకోనున్నందున వేలాది మంది ఉద్యోగులతో సభ నిర్వహిస్తున్నాం.
– ముత్యాల సత్యనారాయణగౌడ్, భాగ్యనగర్ ఎన్జీవోస్ (గచ్చిబౌలి) హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
2025 జూలై 16న దీక్షలు షురూ..
తమ భూమి కోసం, ప్రైవేట్ వ్యక్తుల కబ్జా నుంచి తమ భూములకు విముక్తి కల్పించాలని కోరుతూ 2025, జూలై 16న భాగ్యనగర్ ఎన్జీవో హౌసింగ్ సొసైటీ సభ్యులు శాంతియుత దీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ ఏడాది కాలంగా వరుసగా దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారంతో నిరసన దీక్షలకు ఏడాది కానుండటంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచడంతోపాటు తమ సుదీర్ఘ సంకల్పానికి గుర్తుగా వేలాది మంది ఉద్యోగులతో సభ జరుపాలని నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

