హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ఎల్ నినో నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి తక్షణమే నీటిని ఎత్తిపోయాలని మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ తాము చేస్తున్న డిమాండ్‌కు ఇప్పటికీ పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు కురువడం లేదని, రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తక ముందే ఎండిపోతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ మహానగరానికి తీవ్ర తాగునీటి కష్టాలు ఎదురవుతాయని హెచ్చరించారు. కేవలం తాగునీరు, సాగునీటికే కాకుండా రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించాలని సూచించారు.
ఎన్టీపీసీ, సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు నిరంతరాయంగా పనిచేయాలంటే తప్పనిసరిగా నీళ్లు కావాలని, కాబట్టి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా నీటిని లిఫ్ట్ చేయాలని కోరారు. ప్రాజెక్టుల భద్రతకు సంబంధించి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఇప్పటికే గ్రౌటింగ్ పనులు పూర్తిచేశారని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికలో కూడా స్పష్టంగా ఉన్నదని గుర్తుచేశారు.
సాంకేతిక నివేదికలను ఆధారంగా చేసుకొని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాజకీయాల కోసం భేషజాలకు పోయి రాష్ట్ర పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని, వారిని అవస్థల పాలు చేయొద్దని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ హితవు పలికారు.