హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : ‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దాం. వానకాలం రైతుభరోసా వేసి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోదాం. ఆ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అవి పూర్తికాగానే మున్సిపల్ ఎన్నికలకు పోదాం. ఆగస్టు మొదటి వారం వరకు అన్నీ ఎన్నికలను పూర్తి చేయగలిగితే మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి’ అని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు నిర్ణయించినట్టు తెలిసింది. రైతులు, రైతుకూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ ముగిసిన నేపథ్యంలో ఇక లోకల్‌బాడీ ఎన్నికల మీద దృష్టిపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
వానకాలం కాబట్టి గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండవని, పొద్దంతా వ్యవసాయ పనుల్లోనే లీనమై పోతారు కాబట్టి ప్రభుత్వం వైఫల్యాల మీద పెద్దగా చర్చ ఉండదని, ఎలాగూ రైతుభరోసా వేస్తున్నాం కాబట్టి, రైతాంగానికి ప్రభుత్వం మీద కోపతాపాలు కూడా అంతగా ఉండవని ఆలోచన చేసినట్టు తెలిసింది. జూన్ ఆఖరి వరకు అర్హులైన రైతులందరికీ రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో వేసి, జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలచేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగులో ఉన్న 1.53 కోట్ల సాగు భూమికి రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. రూ.9,200 కోట్లు అవసరమవుతాయని నిర్ధారించి, ఆ మొత్తాన్ని ఖజానాలో అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్.. ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించినట్టు తెలిసింది. గ్రామ పంచాయతీలు, వార్డు లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలవారీగా ఓటర్ల జాబితాను ఆధునికీకరించాలని, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్‌ను నిర్వహించి, సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల్లో ఓటరు లిస్టుల ఆధునికీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాను సవరించనున్నది. త్వరలో రిజర్వేషన్లు ఖరారు చేసే విధంగా కసరత్తు జరుగుతున్నది.
గ్రామీణ ప్రాంత ఎన్నికలు ముగిసిన అనంతరం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. జూన్ ముగిసేనాటికి వార్డుల విభజన పూర్తిచేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను రూపొందించినట్టు సమాచారం. రాష్ట్రంలో మొత్తం 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా.. వాటిలో ఓఆర్ఆర్ బయట ఉన్న 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే వార్డుల విభజన చేపట్టాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 13 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని నిర్ణయించడంతో ప్రస్తుతానికి ఇక్కడ వార్డుల విభజన అవసరం లేదని నిర్ణయించినట్టు సమాచారం. పాలకవర్గాల పదవీకాలం ఇంకా ముగియని ఏడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో (కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట) విభజన అవసరం లేదని నిర్ణయించినట్టు తెలిసింది. కొత్తగా ఎలాంటి గ్రామా లు కలవడం కానీ, విడిపోవడం కానీ జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా వార్డుల విభజన అవసరం లేదని తేల్చినట్టు సమాచారం. ఆగస్టు 15 కల్లా అన్ని రకాల స్థానిక ఎన్నికలను పూర్తిచేయాలని రేవంత్ ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బిల్లులకు కేంద్రం ఇప్పటికిప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని, 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమని కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతి ఇవ్వకపోయినా, పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే ఆసారం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా బీసీ అభ్యర్థులనే పోటీకి నిలబెట్టే విధంగా వ్యూహాత్మక ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది.