Anganwadi Recruitment | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ‘త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకుపైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేస్తాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంరోజే నియామక ప్రక్రియను మొదలు పెడతాం. సాధ్యమైంత తొందరలో పారదర్శకంగా నియామకాలు పూర్తిచేస్తాం’ ఇది గత ఫిబ్రవరి 24న మంచిర్యాల కాంగ్రెస్ సభలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేసిన ప్రకటన. కానీ, మార్చి 8న ఆమె మాటలు కార్యరూపం దాల్చలేదు. ఖాళీలను గుర్తించి నోటిఫై చేసిన సర్కారు ఇందుకు సం బంధించిన మార్గదర్శకాలను రూపొందించనేలేదు. ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపుతూ నేటి వరకూ ఆ ప్రక్రియనే మొదలు పెట్టలేదు. రాష్ట్రంలోని 34,800 అంగన్వాడీ కేంద్రాల్లో 14, 277 టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ముందుకు కదలడమే లేదు. ప్రభుత్వం సాకులు చెప్తున్నదని అంగన్వాడీ యూనియన్ల నాయకులు ఆరోపిస్తున్నారు. ఖాళీల భర్తీలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 34,800 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో సుమారు 70వేల మంది అంగన్వాడీలు, ఆయాలు ఉండాలి. కానీ 14 వేల పోస్టులు ఖాళీలు ఉన్నా యి. దీంతో అటు టీచర్లు, హెల్పర్లపై పనిభారం పెరిగింది. కొన్ని కేంద్రాల్లో టీచర్లు, మరికొన్ని చోట్ల ఆయాలు ఒక్కొక్కరి చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో బాలల ఆలనాపాలన చూస్తూ, వారికి అక్షరాలు నేర్పిస్తూ, మరోవైపు తల్లులు, బాలింతలకు పౌష్ఠికాహారం సరఫరా చేయడం తలకు మించిన భారమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల భర్తీపై మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు.
పెద్దసంఖ్యలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో గ్రామీణ నిరుద్యోగ మహిళలు మురిసిపోయారు. సుమారు రెండు నెలల నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై తాత్సారం చేస్తుండటంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్య సమసిపోయినందున వెంటనే నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని కోరుతున్నారు.
ఈ ప్రభుత్వం మాటలకే పరితమవుతున్నది తప్ప ఆచరణలో విఫలమవుతున్నది. అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీచేస్తామని ప్రభుత్వం అనేకమార్లు చెప్పింది. మినీ అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చింది. 12 నెలలుగా వారికి పెరిగిన వేతనాలు ఇవ్వడమే లేదు. అటు సర్వే, డాటా ఎంట్రీ సహా ఎన్నో బాధ్యతలను అప్పగిస్తున్నారు. పోస్టుల భర్తీలో ఆలస్యం చేస్తుండటంతో ఉన్న టీచర్లు, హెల్పర్లు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.