హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి బీఆర్ఎస్పై బురదజల్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. నిజం నిప్పులాంటిది. తెరవెనుక బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వమే 373.22 ఎకరాలను ప్రైవేట్ కంపెనీల పరం చేసేందుకు సిద్ధమైందని, సర్కారుకు దఖలు పడాల్సిన విలువైన భూముల్లో రియల్ దందాకు తెరలేపిందని బయటపడింది. ఇందుకు సంబంధించిన విస్తుపోయే ఆధారాలు ‘నమస్తే తెలంగాణ’ చేతికి చిక్కాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిబంధనల ప్రకారం ఆ భూములను ప్రభుత్వపరం చేసుకునేందుకు అధికారిక చర్యలు ప్రా రంభించగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఆ ప్రక్రియను అటకెక్కించినట్టు తెలుస్తున్నది.
‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాదర్గుల్ భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు గాలికి వదిలేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. అయితే ఆయన చెప్పింది పచ్చి అబద్ధమనేందుకు ఆధారాలు లభించాయి. 373.22 ఎకరాలను ప్రైవేటు భూమిగా పేర్కొంటూ 2015లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా, అవి ప్రభుత్వ భూములేనంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయస్థానాల్లో పోరాడింది. ఇదేసమయంలో ఒకవేళ అవి ప్రైవేట్ భూములైతే ‘ఏపీ భూసంస్కరణలు (సీలింగ్) చట్టం’ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలనూ మొదలుపెట్టింది. ఈ మేరకు అధికారులు 2019లో ఒకసారి (నెం.బీ/2705/2019, 8.11.2019) నోటీసులు జారీ చేశారు. రెండోసారి 9.1.2020న నోటీసు ఇచ్చారు. తమకు మరికొంత సమయం కావాలని వారసులు కోరగా, 15 రోజుల వ్యవధి కూడా ఇచ్చారు. ఆ తర్వాత 14.2.2020న మూడోసారి నోటీసు ఇచ్చి, 30 రోజుల గడువు విధించారు. దీంతో చివరకు సదరు వారసులు ఫారం-1లో 3.9.2020 తేదీన నాదర్గుల్ గ్రామంలో తమకు సర్వేనెంబర్లు 284, 320, 364, 440, 567, 613, 721ల్లో 934.16 ఎకరాలు ఉన్నట్లుగా డిక్లరేషన్ ఇచ్చారు. దీని తర్వాత సీలింగ్ చట్టానికి అనుగుణంగా ఫారం-4, ఫారం-5 నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అంటే సదరు వారసులు ఇచ్చిన వివరాలను సమగ్రంగా పరిశీలించి, వాటిని ఫారం-4 ద్వారా పబ్లిక్ నోటీసు ఇచ్చి వాటిపై అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకొని పరిమితికి మించి ఎంత భూమి ఉన్నది? ఏయే సర్వేనెంబర్లలో ఉన్నది? అనేది నిర్ధారించాల్సి ఉందనే వివరాలతో ఫారం-5 ద్వారా సీలింగ్ సర్ప్లస్ భూముల వివరాలను వెల్లడిస్తారు. ఈ ప్రక్రియ అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
నాదర్గుల్ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన చర్యలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు కొనసాగించారు. సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండటంతో కందుకూరు ఆర్డీవో 2024 డిసెంబర్ 9న సుప్రీంకోర్టు ది అడ్వకేట్ ఆన్ రికార్డుకు లేఖ (నెం.డి/727/2008) రాశారు. నాదర్గుల్ గ్రామంలోని శివరాజ్ బహదూర్ భూములకు సంబంధించి సీలింగ్ చట్టం అమలుకు తామెలాంటి చర్యలు తీసుకున్నామనే వివరాలను అందులో పొందుపరిచా రు. ఆ క్రమంలో చట్టం అమలులో భాగంగా చివరి రెండు దశలు (ఫారం-4, 5) ప్రక్రియల్ని కూడా చేపడుతున్నామని, అవన్నీ తమ పరిశీలనలో ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. త్వరలో బాలాపూర్ తహసిల్దార్‌కు ఫారం-4, 5 నోటీసులు పంపి ప్రచురిస్తామని చెప్పారు. ఆ నోటీసుల ప్రతులను కూడా సుప్రీం కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటే ఇప్పటికే సీలింగ్ సర్ప్లస్ భూముల ప్రకటన పూర్తయ్యేది. వేల కోట్లు విలువ చేసే వందలాది ఎకరాల భూములు ప్రభుత్వ ఖాతాలోకి చేరేవి.
నాదర్గుల్ భూములపై నిబంధనల మేరకు అడుగులు వేస్తున్న అధికారులు 2024, డిసెంబరు తర్వాత 2025, మార్చిలో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలో బాలాపూర్ తసిల్దార్ ఇ చ్చిన నివేదిక ఆధారంగానే అఫిడవిట్లో రెండు రకాల వాదనలు గట్టిగా వినిపించారు. ఒకటి… అవి ప్రైవేటు భూములైనట్లయితే సీలింగ్ చట్టం ప్రకారం అందులో సర్ప్లస్ ప్రకటించాల్సి ఉంటుంది. ఇవికాకుండా రెవెన్యూ రికార్డుల్లో దస్తగర్దన్ అంటే ఇనాం భూములుగా వస్తున్నందున 1955లోనే ఇనాం రద్దు చట్టం అమలులోకి వచ్చినందున పూర్తిగా ఆ భూములన్నీ ప్రైవేటుపరం కావాలి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి తుది తీర్పు రావాల్సి ఉంది. అంతవరకు అధికారులు సీలింగ్ చట్టం అమలు ప్రక్రియను కొనసాగించాల్సి ఉన్నా… ఏడాదిన్నరగా ఆ ప్రక్రియ అటకెక్కిందంటే సర్కార్ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్తున్నారు. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ భూములపైకి రాని ప్రైవేటు కంపెనీలు ఒక్కసారిగా వచ్చి, ఫెన్సింగ్ వేయడంతోపాటు గుట్టలన్నింటికీ అక్రమ మైనింగ్‌తో పొతం పెట్టారు. ప్రహరీ ని ర్మాణానికి అనుమతులతో భారీ ఎత్తున రియల్ దందా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ భూబాగోతం పడి సీన్ రివర్స్ అయింది.

నాదర్గుల్ భూములపై బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు గళం విప్పడంతోపాటు ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురిస్తుండటంతో అటకెక్కించిన సీలింగ్ చట్టం అమలు ప్రక్రియను పునరుద్ధరించినట్టు తెలిసింది. ఈ మేరకు కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి విష యాన్ని ధృవీకరించారు. మరి అదే సీలింగ్ చట్టం ప్రకారం ఒకవైపు ప్రక్రియ కొనసాగుతుండగా ఆ భూములన్నీ ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఎలా ఉంటాయని పలువురు రెవెన్యూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రక్రియ పురోగతి ఉన్నపుడు వారసు లు ప్రైవేటు కంపెనీలతో ఎలా ఒప్పందం చేసుకుంటారు? అధికారులు ఎలా ఊరుకుంటున్నారు? అని అడుగుతున్నారు. సీలింగ్ చట్టం మేరకు ఆ భూములకు ఆర్డీవో కస్టోడియన్ అయినందున వెంటనే వాటిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని, కానీ ఆ దిశగా చర్యలు లేవంటే ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.
బడంగ్పేట్, ఏప్రిల్ 15: నాదర్గుల్ రైతుల భూపోరాటం బుధవారానికి 12వ రోజుకు చేరింది. రోజుకో తీరుగా నిరసన లు తెలుపుతూ దీక్ష కొనసాగిస్తున్నారు. బుధవారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించగా, దీక్షా శిబిరాన్ని సీపీఎం నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. సీలింగ్ చట్టాలను తుంగలో తొక్కి రైతుల నోట్లో మట్టికొడుతున్నారని, తప్పు డు పత్రాలతో రుణాల తీసుకున్న సంస్థలపై ఈడీ దృష్టి పెట్టాలని సీపీఎం నే త, బాలాపూర్ మండల ఇన్చార్జి గోరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూ ముల్లో ప్రైవేట్ సైన్యం ఎందుకు కాపాలా ఉన్నదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. 2007లో నియమించిన జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.