నిజాంసాగర్, మే14: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్‌షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. పంటల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు సరఫరా చేయడంలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జుక్కల్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎక్కడా జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో జొన్న సాగు చేసిన రైతన్నలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రైతులు సొసైటీల ఆవరణలో ఆరబెట్టిన జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోయే ప్రమాదం ఉందన్నారు. జొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ కాకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వెంటనే పొద్దుతిరుగుడు, మక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శనగ పంట కొన్నప్పటికీ ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు వేయలేదన్నారు. రైతు సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులందరినీ ఏకం చేసి తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, నాయకులు పాకాల్వార్ విజయ్, కృష్ణపటేల్, రాజేశ్వర్‌గౌడ్, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.