న్యూఢిల్లీ, మే 14: ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తున్నది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెలలో ఏకంగా 42 నెలల గరిష్ఠాన్ని తాకింది. ఏప్రిల్‌లో 8.3 శాతంగా నమోదైనట్టు గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు నెల మార్చిలో 3.88 శాతంగానే ఉండగా, నిరుడు ఏప్రిల్‌లో 0.85 శాతంగానే ఉండటం గమనార్హం.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం.. భారత్‌పై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వార్తో అటు ఇంధన ఉత్పత్తికి, ఇటు సరఫరాకు ఇబ్బందులు ఏర్పడటంతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండటంతో.. గ్లోబల్ మార్కెట్లో ఎగసిపడుతున్న క్రూడాయిల్ రేట్లు భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఏప్రిల్కుగాను ఇటీవల విడుదలైన రిటైల్ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా పెరిగింది తెలిసిందే. 3.48 శాతంగా నమోదైంది. నగల ధరలు, ఇతరత్రా గృహోపకరాణాలు, ఆహారోత్పత్తుల రేట్లు పెరిగినట్టు తేలింది.
లోహాలు, రసాయనాలు, టెక్స్టైల్ రంగాల ఉత్పత్తుల రేట్లు పెరిగాయని, దీంతో కొత్త సిరీస్‌లో గరిష్ఠంగా ద్రవ్యోల్బణ గణాంకాలు నమోదైనట్టు సంబంధిత అధికార వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం, విద్యుత్తు రంగాల్లో ధరలు గత నెలలో 42 నెలల గరిష్ఠాన్ని సూచిస్తూ 24.71 శాతంగా నమోదవడం గమనార్హం. మార్చిలో ఇవి కేవలం 1.05 శాతంగానే ఉన్నాయి. ముడి పెట్రోలియంలో ద్రవ్యోల్బణం రేటు 88.06 శాతంగా ఉన్నది. అక్టోబర్ 2021 తర్వాత ఇదే అత్యధికం. అమెరికాకు అండగా ఉంటున్నాయని పొరుగు దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలపై ఇరాన్ దాడులు చేస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో ఆయా దేశాల్లో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకూ ఇరాన్ అడ్డు తగులుతున్నది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను ఎగదోస్తున్నది. ఈ పరిస్థితి.. భారత్ సహా, అనేక దేశాలకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే దేశంలో వంటగ్యాస్ ధరలు పెరిగినది విదితమే. ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలూ పెరిగాయి. ఇక ఆహారోత్పత్తుల ధరల సూచీ 1.98 శాతంగా ఉన్నది. ఆహారేతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 12.18 శాతానికి పెరిగింది. ఇలా.. ఇవన్నీ టోకు ద్రవ్యోల్బణం గణాంకాలను అమాంతం పెంచేశాయి.
రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగిన నేపథ్యంలో వచ్చే నెల జరుగబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు పెంచే వీలుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిరేటు బలోపేతం కోసం గత కొన్ని నెలలుగా రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్న సెంట్రల్ బ్యాంక్.. ఈసారి మాత్రం పెంపునకే జై కొడుతుందన్న అంచనాలున్నాయి. ఇదే జరిగితే ఆటో, గృహ, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు పెరుగుతాయి. రుణగ్రహీతల ఈఎంఐలు భారంగా మారుతాయని ఆయా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపునకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు సైతం కొనుగోలు శక్తిని తగ్గిస్తుందని, తద్వారా దుబారాకు కొంతమేర బ్రేకులు పడుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. దీంతో ఈసారి ద్రవ్యసమీక్షలో రెపోరేటును పావు శాతం పెంచవచ్చన్న ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.