జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గాల గడువు ఈ నెల 14తో ముగియనుంది. ఎన్నికలపై రేవంత్రెడ్డి సర్కారు ఇంకా ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే అందుకు అవసరమైన ప్రక్రియను సిద్ధం చేయాలని అధికార యంత్రంగానికి ఆదేశాలు జారీ చేసి ఉండేది.
కానీ, ఇప్పటివరకు ఆ ఊసే లేదు. దీంతో పాలకవర్గాల గడువును మళ్లీ పొడిగించే అవకాశం ఉందంటూ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతోనే గడువు పూర్తయినప్పటికీ ఎన్నికలకు వెళ్లకుండా ఆరు నెలలపాటు గుడువు పొడిగించింది. ఆ గడువు కూడా మరో 48 గంటల్లో పూర్తి కానుంది. ప్రభుత్వంపై రైతులు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలను తప్పించుకోవడం కోసం, అనుకూలమైన పాలకవర్గాలను నియమించుకోవడం కోసం నామినేటెడ్ పద్ధతిని సైతం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 21 సహకార సంఘాలు ఉండగా.. ప్రభుత్వం ఎప్పటి నుంచో వీటి సంఖ్యను పెంచాలనే ఆలోచనలో ఉంది.
-అశ్వారావుపేట, ఆగస్టు 12
వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమించి సహకార సంఘాలను నిర్వహిస్తుంటుంది. ప్రతి సొసైటీకి సీఈవోతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన పాలకవర్గాల గడువు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరిలో ముగిసింది.
అయితే, ఆ వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. పైగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికైన పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించింది. ఆ గడువు కూడా మరో రెండు రోజుల్లో ముగిసిపోనుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి హడావిడీ లేదు. ‘ఎన్నికలు నిర్వహించాలా? లేక మళ్లీ పదవీకాలాన్ని పొడిగించాలా?’ అనే విషయంపై కూడా జిల్లా అధికారులకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో జిల్లా సహకార శాఖ అధికారులు కూడా మీమాంసలో పడ్డారు. ప్రభుత్వం నుంచి వెలువడే ఆదేశాల కోసం ఎదురుచూద్దామనే నిర్ణయానికి వచ్చారు.
రైతు సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమతో ముడిపడి ఉన్న సహకార సంఘాల ఎన్నికలకు వెళ్లేందుకు భయపడుతుందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. రుణమాఫీ నుంచి మొదలుకొని రైతుభరోసా వరకూ అడుగడుగునా కొర్రీలు పెట్టిన విషయాలను కర్షకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూరియా కొరత కూడా అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక, వర్షాలు కూడా సమృద్ధిగా కురవలేదు. దీనికితోడు విద్యుత్ సరఫరాను ప్రభుత్వం సక్రమంగా చేయకపోవడం పట్ల కూడా రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈ క్రమంలో ఎన్నికలకు వెళ్తే రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ ఆలోచనలూ చేస్తోంది. ఎన్నికలకు వెళ్లకుండా నామినేట్ చేయాలనే ఆలోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏ నిర్ణయం గురించి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు కూడా అయోమయంతో తలలు పట్టుకుంటున్నారు. అయితే, 2020 ఫిబ్రవరి 13న సహకార ఎన్నికలు జరుగగా.. తర్వాత రోజు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల పాలకవర్గాల సభ్యులు ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం కూడా ఈ నెల 14తో ముగుస్తుంది.
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 21 సహకార సంఘాలు ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు పాలకవర్గాల నుంచి జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మరో 35 కొత్త సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం వీటిని ఆమోదిస్తే సంఘాల సంఖ్య మొత్తం 56కు చేరుతుంది. అయితే, కొత్త జిల్లా స్థాయిలో సహకార బ్యాంకు విస్తరణ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
సహకార సంఘాల పాలకవర్గాలకు పెంచిన పదవీకాలం కూడా పూర్తి అవుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. తాత్కాలిక పాలకవర్గాల వల్ల సొసైటీల బలోపేతం అసాధ్యం. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిది.
-బత్తిన పార్థసారథి, సొసైటీ డైరెక్టర్, అశ్వారావుపేట