అమీర్‌పేట్, జూన్ 16: బల్కంపేట ఎల్లమ్మకు దాతలు సమకూర్చిన స్వర్ణ కవచానికి జరుగుతున్న సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ఈ విశేష పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. నూతన స్వర్ణ కవచ సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారి స్వర్ణ కవచాన్ని యాగశాల నుంచి మంత్రి తలసాని, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, దాతలు యుగంధర్, రజిని దంపతుల చేతుల మీదుగా ప్రధాన ఆలయం గర్భగుడిలోని మూలవిరాట్‌కు అమర్చారు. దాతలు యుగంధర్, రజినీ దంపతులు 2 కిలోల 586 గ్రాముల బంగారంతో తయారు చేయించిన స్వర్ణ కవచాన్ని తమ కుమార్తె అహల్య పేరు మీద అమ్మవారికి బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాల్లో శాంతికుమారి దాతలతో కలిసి పాల్గొన్నారు. దేవాలయ ప్రాశస్త్యాన్ని మంత్రి తలసాని, సీఎస్‌కు వివరించారు. అనంతరం శాంతికుమారి దేవాలయం ఆవరణలోని పోచమ్మ, నాగదేవతలతో పాటు అద్దాల మండపాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆమెకు అమ్మవారి ప్రసాదం అందజేయగా.. వేద పండితులు చింతపల్లి సుబ్రహ్మణ్యేశ్వర శర్మ ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో పాటు పాలక మండలి సభ్యులు జి.యాదగిరి యాదవ్, సంతోష్ సరఫ్, దాసోజు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారి చీర తయారీని ప్రారంభించిన సీఎస్
ఈ నెల 20న జరుగనున్న అమ్మవారి కల్యాణోత్సవానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వారు ప్రతియేటా దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసి చీరలను తయారు చేసి సమర్పించుకుంటారు. శుక్రవారం దేవాలయ ఆవరణలో పద్మశాలి సంఘం ఏర్పాటు చేసిన మగ్గంపై అమ్మవారి కల్యాణ చీర తయారీ పనులను సీఎస్ శాంతికుమారి, మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు. అమ్మవారి కల్యాణానికి పసుపచ్చ రంగు చీరకు ఎరుపు కొంగు వచ్చేలా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో మొత్తం ఆరు రంగుల పట్టు దారాలను వినియోగిస్తున్నట్టు చీరను తీర్చిదిద్దుతున్న ఎస్.ఎస్.జయరాజ్ పేర్కొన్నారు.